కేశినేని శివనాథ్, కొలికపూడి శ్రీనివాస్ పంచాయతీని క్లైమాక్స్ కు తీసుకు రావాలని.. కావాలంటే ఒకర్ని, లేకపోతే ఇద్దర్నీ వదిలించుకోవాలని టీడీపీ పెద్దలు గట్టి నిర్ణయానికి వచ్చారు. వారితో సామరస్యంగా ఉంటే.. ఇలాంటి నేతలు పెరిగిపోతారని.. వైరస్ గా మారి.. అందరూ అదేపని చేస్తారని టీడీపీ పెద్దలు బావిస్తున్నారు. అందుకే క్రమశిక్షణా కమిటీని రంగంలోకి దింపారు.
టీడీపీ క్రమశిక్షణా కమిటీ నాలుగో తేదీన వీరిద్దరూ విడివిడిగా హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం కొలికపూడి శ్రీనివాసరావును పిలిచారు. ఆయనపైనే తీవ్ర అభియోగాలు ఉన్నాయి. ఎంపీపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలను సమర్పించమని అడిగే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఎంపీ శివనాథ్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. క్రమశిక్షణతోనే ఉన్నారు.
కానీ తిరువూరులో రాజకీయాలను ఆయన సెటిల్ చేయడంలో విఫలమయ్యారు. కొలికపూడి విషయంలో ఆయన మరింత రెచ్చగొట్టినట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. వీటన్నింటిపై క్రమశిక్షణా కమిటీ విచారించి.. చంద్రబాబుకు నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. కఠినచర్యలు తీసుకుంటనే ఇతరులు ఇలా రోడ్డున పడే ప్రయత్నం చేయరని టీడీపీ క్యాడర్ అంటున్నారు.
