గోదావరి పుష్కరాలని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించినప్పటికీ త్రొక్కిసలాటలో 32మంది మరణించడంతో తీరని అప్రదిష్ట మూటగట్టుకొంది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లయింది. కృష్ణా పుష్కరాలలో మళ్ళీ అటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తీసుకొంటున్న అతిజాగ్రత్తలే ఈసారి దాని కొంపముంచేలా ఉన్నాయి. పుష్కరాలకి వచ్చే లక్షాలాది మంది భక్తులు సులభంగా, సౌకర్యవంతంగా తమ కార్యక్రమాలు ముగించుకొని వెళ్లేందుకు గాను, ప్రభుత్వం విజయవాడలో రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టింది.
దాని కోసం అనేక దేవాలయాలు, మసీదులు తొలగించడంతో మిత్రపక్షం భాజపాతో సహా ప్రతిపక్షాలు, హిందూ ముస్లిం మత సంస్థలు కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాలు, మసీదులు తొలగించడమే కాకుండా కొన్ని చోట్ల అదే స్థానంలో టాయిలెట్లు నిర్మిస్తున్నట్లు వైకాపా ఆరోపిస్తోంది. దేవతా మూర్తులకి నిత్యపూజలు జరిగే చోట టాయిలెట్లు నిర్మించడం నిజమైతే, తెదేపా ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. విజయవాడలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో అది కాంగ్రెస్, వైకాపాలని దగ్గరకి చేర్చింది. ఆ రెండు పార్టీలు కలిసి తెదేపా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి.
తాజాగా ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డు జంక్షన్ (గాంధీ బొమ్మ జంక్షన్) లో ఉన్న గాంధీ విగ్రహాన్ని గురువారం అర్ధరాత్రి ఆర్ అండ్ బి అధికారులు తొలగించారు. 1948లో ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని తొలగించేటప్పుడు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అది ముక్కలైపోయింది. ఆ విషయం ప్రజలకి, ప్రతిపక్షాలకి తెలిస్తే ఎక్కడ గొడవ అవుతుందో అనే భయంతో దానిని పక్కనే ఉన్న బుడమేరు కాలువలో పడేసి వెళ్ళిపోయారు. తెల్లారేసరికి ఆ విగ్రహం కనబడకపోవడంతో స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతున్నప్పుడు అది బుడమేరులో దొరికింది. దానిని వారు బయటకి తీసి ఆందోళన చేస్తున్నారు. వైకాపా నేతలు వారితో జత కలిసారు. మళ్ళీ యధాస్థానంలో కొత్త విగ్రహం తయారు చేయించి పెడతామని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి వారు ఆందోళన విరమించారు. అది వేరే సంగతి. జరుగుతున్న ఈ పరిణామాలు తెదేపాకి మేలు కలిగిస్తాయా కీడు చేస్తాయా? అని ఆలోచిస్తే అని వర్గాల ప్రజలలో వ్యతిరేకత కలిగిస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. పుష్కరాలకి అద్భుతంగా ఏర్పాట్లు చేసి ప్రజల మెప్పు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇటువంటి పనుల వలన కానీ దానికి ఊహించని నష్టం జరిగే అవకాశం కనబడుతోంది.