ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకి చాలా మందినే ఆహ్వానించింది. వారిలో జగన్, జూ.ఎన్టీఆర్ కూడా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు ఎక్కడా వార్తలు రాలేదు. ఒకవేళ పిలిచినా ఆయన వస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే పుష్కరాలకి వస్తే మళ్ళీ దానిపై కూడా పెద్ద దుమారం రేగుతుంది. చివరికి అదెక్కడికో వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ వస్తారో రారో తెలియకపోయినా ప్రభుత్వం ఆయనని ఆహ్వానించి ఉండకపోయుంటే చాలా ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే ఇదివరకు ఇటువంటి ప్రతీ కార్యక్రమానికి ఆయనని మరిచిపోకుండా పిలిచేవారు. కానీ ఈసారి ఆయనని మరిచిపోయి(పక్కనబెట్టి), తెదేపా నుంచి దూరం చేసుకొన్న జూ.ఎన్టీఆర్ ని ఆహ్వానించినందునే తెదేపా ప్రభుత్వాన్ని అనుమానంగా చూడవలసి వస్తోంది.
రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా రెండు అంశాలలో పవన్ కళ్యాణ్ తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి దానిపట్ల తన వ్యతిరేకతని చాటుకొన్నారు. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ తెదేపా, భాజపాలకి వ్యతిరేకంగా మాట్లాడకపోయినప్పటికీ, వాటికి దూరంగా ఉండటం ద్వారా వాటిలో భయాందోళనలు కలిగించగలిగారని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికలలో ఆయన తమకి మద్దతు ఇస్తారా లేదా? లేదా రెండు పార్టీలలో దేనికో ఒకదానికే మద్దతు ఇస్తారా? ఒకవేళ రెంటికీ మద్దతు ఇవ్వకుండా స్వయంగా ఎన్నికల బరిలోకి దిగుతారా? అనే అనుమానాలు రేకిత్తించగలిగారు.
బహుశః ఆ కారణంగానే, ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతో తెదేపా ముందు జాగ్రత్తగా జూ.ఎన్టీఆర్ ని మంచి చేసుకొనే పనిలో పడినట్లుంది. కానీ జూ.ఎన్టీఆర్ కూడా తెదేపా ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి పుష్కరాలకి రాకపోవడం గమనిస్తే ఆయన కూడా తెదేపాకి దూరంగా ఉండటమే మేలని భావిస్తునట్లుంది. కానీ ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కనుక ఆలోగా వారిద్దరిలో ఎవరో ఒకరిని తెదేపా దగ్గరకి తీసుకొనే ప్రయత్నం చేయవచ్చు.