సోషల్ మీడియాలో తెలుగుదేశం డల్!

ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్, గూగుల్ ప్లస్, వాట్సప్ వగైరా సోషల్ మీడియా అప్ డేట్ లలో, పోస్టింగులలో తెలుగుదేశం పార్టీ వెనుకబడిపోయింది. ప్రతిపక్షంలో వున్నపుడు తెలుగుదేశం ఐటి, సోషల్ మీడియా విభాగాల పోస్టింగులు విద్యావంతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత నిరంతరం నిలబడేలా చూసేవి. ఇది తెలుగుదేశం పట్ల అభిమానం పెరగడానికి ఎంతోకొంత దోహదపడేవి. కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో పోస్టింగులకు ప్రత్యేక విభాగాలు లేవు.

ఇప్పుడు తెలుగుదేశం ఐటి వింగ్ డల్ అయిపోయింది. పార్టీ పరంగా ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం దాదాపు జరగడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎదురుదాడులు కుదరవు. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో చేసినన్ని విమర్శలు అధికారంలో చెయ్యలేరు. ఈ కారణం కూడా తోడవ్వడంతో వైసిపి సోషల్ మీడియాలో దూసుకుపోతుంటే టిడిపి చతికిల పడింది.
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్ డేట్లకు సోషల్ మీడియాలో విస్తృతి పెరిగింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పోస్టింగ్స్ కి వున్న రీచ్, లైక్ లు, షేర్లు జగన్ పార్టీకి మారుతున్నట్టు వున్నాయి. అధికార పార్టీకి వుండే అసౌకర్యం, ప్రతిపక్షానికి వుండే సౌలభ్యం ఇందుకు ఒక కారణం కావచ్చు.

ఏదో ఒక సోషల్ మీడియా తో దేశవ్యాప్తంగా 25 కోట్లమంది కనెక్ట్ అయివున్నారు. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాలు ప్రధానంగా వున్న 260 లోక్ సభా నియోకవర్గాల్లో 10 శాతం మంది ఓటర్ల మీద సోషల్ మీడియా ప్రభావం వుందని 2012 లోనే ఒక సర్వేలో వెల్లడయింది.

సోషల్ మీడియా శక్తి సామర్ధ్యాలు నరేంద్రమోదీకి తెలిసినంతగా మరే రాజకీయవేత్తకూ తెలియవు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా ఆయన సొంత ట్విట్టర్ హాండిల్ నుంచి ట్వీట్ చేస్తూనేవున్నారు. ప్రజల్లో పలుకుబడి పలచనౌతున్న సందర్భంలో, అసహనంపై విమర్శలు విరుచుకుపడుతున్న కాలంలో కూడా మోదీపై ఈగ వాలనీయమన్నంత అంకితమైన అనుచరులు, అభిమానుల్ని తీర్చిదిద్దింది ఆయన సోషల్ మీడియా విభాగమే అంటే అతిశయోక్తి కాదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ కీ , ఆయన కుమారుడైన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ కీ, ట్విట్టర్ హాండిల్స్ వున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఐటి/సోషల్ మీడియా విభాగమే వుంది. అయితే ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోడానికి, విమర్శలను తిప్పికొట్టడానికి వ్యవస్ధాగతమైన సోషల్ మీడియా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

”సోషల్ మీడియాలో విమర్శలకు కూడా ఎక్కడ స్పందిస్తాం” అన్నది 13 జిల్లాలు వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ దృక్పధం. దేశంలో ఎక్కడి నుంచైనా పై ఒక్క విమర్శ వస్తే రెండునిమిషాల్లో కనీసం ముగ్గురు ఖండించే సోషల్ మీడియా నరేంద్రమోదీ బలం. ఐటి, సోషల్ మీడియాలపై లోతైన అవగాహన వున్న చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం కోసం, తన పార్టీకోసం సోషల్ మీడియాను తద్వారా నెటిజన్ల మద్దతును విస్తరించకోలేకపోవడం గమనార్హం! బాబు హైటెక్ స్పృహ ఆయన సొంతానికే ఉపయోగపడకపోవడం విశేషం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com