ఇంతకు ముందు తెరాస మంత్రులు నేతలు ఏమి తప్పు చేసారో మళ్ళీ ఇప్పుడు తెదేపా మంత్రులు, నేతలు కూడా అదే తప్పు చేస్తున్నట్లు కనబడుతోంది. రేవంత్ రెడ్డిని స్టింగ్ ఆపరేషన్ చేసి ఎసిబి అధికారులు అరెస్ట్ చేయక మునుపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంచలన వార్త వినబోతున్నరంటూ చేసిన ప్రకటనతో మొదలయిన తెరాస నేతల హడావుడి నిన్న మొన్నటి వరకు కూడా సాగింది. అప్పుడు తెదేపా నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు. కానీ తెరాస నేతలు అత్యుత్సాహమే వారి కొంప ముంచిందని చెప్పవచ్చును. వారు ఎసిబి అధికారులను తమ పని తాము చేసుకుపోనిచ్చి ఉంటే ఈపాటికి వాళ్ళు చాలా దూరం వెళ్లిపోయుండేవారు. కానీ తెరాస నేతలు చేసిన హడావుడితో అప్రమత్తమయిన చంద్రబాబు నాయుడుతక్షణమే దానికి నివారణోపాయం కనుగొని కేసుని ముందుకు నడవనీయకుండా బ్రేకులు వేయగలిగారు. చంద్రబాబుని ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించాలేదని గొప్పలు పోయిన తెరాస మంత్రులు ఇంతవరకు కనీసం చంద్రబాబుకి నోటీసులు కూడా జారీ చేయించలేకపోవడంతో నవ్వులపాలయ్యారు.
సరిగ్గా ఇప్పుడు తెదేపా నేతలు కూడా తెరాస నేతల్లాగే చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆనాడు తెరాస నేతలు ఏవిధంగా మాట్లాడేరో అలాగే ఇప్పుడు వారు కూడా “కేసీఆర్ జైలుకి వెళ్ళక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలంగాణా ప్రభుత్వమే హైకోర్టులో అంగీకరించింది కనుక కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి తన కుమార్తె కవితకో, కుమారుడు కేటీఆర్ కి గానీ తెలంగాణా ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందని” తెదేపా నేతలు సూచిస్తున్నారు.
కానీ వారు చెపుతున్నట్లుగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి జైలుకి వెళ్ళవలసివస్తే, ఆయన చంద్రబాబుని కూడా తన వెంట తీసుకువెళ్లేందుకు అవసరమయిన అన్ని ఆధారాలు ఆయన వద్ద కూడా ఉన్నాయని ఇప్పుడు పెద్ద గొంతు పెట్టుకొని మాట్లాడుతున్న తెదేపా నేతలందరికీ తెలుసు. కనుక ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో రెండు ప్రభుత్వాలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నాయని వారికీ తెలుసు. అయినా తెదేపా నేతలు ఆవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కేవలం ప్రతీకార వాంఛతోనేనని చెప్పక తప్పదు. తెరాస నేతలు ఓటుకి నోటు కేసులో తమ పార్టీని, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేశారు కనుక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరాసను, వారి ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా అప్రదిష్ట పాలుచేయాలనే ఉద్దేశ్యంతోనే తెదేపా నేతలు ఆవిధంగా రెచ్చిపోతున్నారని భావించవచ్చును.
ఆ రెండు పార్టీలు, ప్రభుత్వాలు నేరం చేసినప్పటికీ ఆ సంగతి దాచిపెడుతూ ఎదుటవాళ్ళని నిందిస్తూ తామే చాలా నిజాయితీపరులమన్నట్లు వాదించుకొంటున్నాయి. కానీ ప్రజలు తమకు ఎందుకు అధికారం కట్టబెట్టారు? తము చేయవలసిన పనేమిటి? చేస్తున్నదేమిటి? ప్రజలు తమ గురించి ఏమనుకొంటున్నారు? అని ఆలోచించకుండా ప్రజలు తాము చెప్పే మాటలనే నమ్ముతారనే ధీమాతో ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ వారికి ప్రజలిచ్చిన సమయం చాలా వేగంగా కరిగిపోతోందనే విషయం మరిచిపోతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారు రాష్ట్రాలని అభివృద్ధి చేయడంలో విఫలమయితే, వచ్చే ఎన్నికలలో మళ్ళీ వారికి ప్రజలు మరో అవకాశం ఈయరానే వాస్తవం గ్రహిస్తే ఈవిధంగా మాట్లాడుతూ కాలక్షేపం చేయరు.