బుద్ధా కౌంటర్లో ముస్లిం ప్రస్థావన ఎందుకు..?

భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపైనా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు విజయవాడలో విలేకరుల ముందు సిద్ధమైపోయారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత గురించి ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి పదవి అవకాశాన్ని రాష్ట్రం కోసం ఆయన వదులుకున్నారన్నారు. ఆస్కార్ అవార్డులు అందుకున్న(?) కమల్ హాసన్ కూడా చంద్రబాబును రియల్ హీరో అని కొనియాడారు అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ దర్శకత్వంలో సోము వీర్రాజు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈరోజున భాజపా నేతలకు పదవులు ఉన్నాయంటే కారణం.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చినవని గుర్తించాలన్నారు. హోదా అయినా ప్యాకేజీ అయినా పేరేదైనా ప్రయోజనాలు ముఖ్యమని నాడు కేంద్రం చెప్పిందనీ, కానీ ఇప్పుడు హోదా గురించి మాట్లాడితే తప్పుపడుతున్నారన్నారు.

దేశ విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి గుర్తింపు ఉందన్నారు బుద్ధా వెంకన్న. అలాంటి చంద్రబాబుపై విమర్శలు చేయడమంటే సూర్యుడిపై బురద చల్లినట్టే అవుతుందన్నారు. జగన్ ఏజెంటుగా వ్యవహరించడం మానుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలని సోము వీర్రాజుకు సూచించారు. ఈ పరిణామాలన్నీ ముస్లిం సోదరులు గమనించాలన్నారు(?). అంతే.. షడెన్ గా ముస్లింల టాపిక్ మధ్యలోకి తెచ్చేశారు. ముస్లింల కోసం రకరకాల సంక్షేమ పథకాలను తెచ్చిందే చంద్రబాబు అన్నారు. రంజాన్ తోఫాగా, పెళ్లి తోఫాగానీ ఇలాంటివన్నీ ఆయన ప్రవేశపెట్టినవే అని చెప్పారు. దేశంలోని ముస్లిం సోదరులంతా చంద్రబాబు నాయుడుకి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు!

అదేంటీ.. సోము వీర్రాజును విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టి, దేశ‌వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు చంద్రబాబుకు బాసటగా నిలవాలని పిలుపునివ్వడం ద‌గ్గ‌ర ముగించ‌డమేంటీ..? పోనీ, ప్రత్యేక హోదాతోగానీ, సోము వీర్రాజు వ్యాఖ్యల్లోగానీ అలాంటి అంశాలే లేవు కదా. దీనిపై బుద్ధా వెంకన్న స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. మధ్యలో ఈ ప్రస్థావన ఏంటండీ అంటే… ‘అన్నీ త్వరలో తెలుస్తాయి, ఎందుకనేది మీ అంతరాత్మకు తెలుసు’ అనే న‌ర్మ‌గ‌ర్భ‌మైన స్పంద‌నొక‌టి..! మరోసారి గుచ్చి అడిగినా.. తరువాత చెప్తాం అన్నారు. అంటే… భాజపాకి ముస్లింలు సహజంగా వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి, ఈ సందర్భంగా వారి మద్దతును కూడగట్టాలనా..? ఆ ముద్ర ఉన్న భాజపాతో మైనారిటీల్లో పట్టున్న వైకాపా కలవబోతోందన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందడం కోసమా..? నిజానికి, ముస్లింలలో భాజపా వ్యతిరేకత అనేది మారిపోయిన విషయం. ట్రిపుల్ తలాక్ బిల్లు, హజ్ యాత్ర సబ్సీడీల సొమ్ముతో ముస్లిం బాలికల విద్యకు ఖర్చు వంటి అంశాలతో భాజపాపై ఉన్న సహజ వ్యతిరేక ముద్రను చాలావరకూ చెరిపేసుకున్నారు. ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా చాటి చెప్పింది అదే. ఇంతకీ, బుద్ధా వెంకన్న ఏం చెప్పాలనుకుంటున్నారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.