వైసీపీ ఘోర పరాజయం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఇటీవలే మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనారోగ్యం నెపంతో గుండె ఆపరేషన్ చేయించుకుని నెలల తరబడి విశ్రాంతి తీసుకున్న ఆయన, ఇప్పుడు అంబటి రాంబాబు పరామర్శ సాకుతో బయటపడ్డారు. లోకేష్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు చూస్తుంటే, నాని తన మెడికల్ లీవ్‌ను పూర్తి చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రత్యర్థులపై కొడాలి నాని వాడిన భాష, చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. తెలుగుదేశం పార్టీ అధినేతలను వ్యక్తిగతంగా దూషించడంలో ఆయన శైలి అప్పట్లో పెను సంచలనం. అయితే వైసీపీ ఓటమి తర్వాత సీన్ రివర్స్ కావడంతో గుడివాడలో కనిపించడం మానేశారు. అనారోగ్యం పేరుతో తప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా అనారోగ్యం కారణంతోనే టీడీపీ ప్రభుత్వం కూడా ఇంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించింది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొడాలి నాని మళ్ళీ మైకుల ముందుకు వచ్చి జగన్ సీఎం అవుతారు.. లోకేష్ కే రిస్క్ అంటూ సవాళ్లు విసరడం ప్రారంభించడంతో, ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలోలా బూతుల పురాణం ఎత్తుకోకపోయినా, ఆయన గొంతులో పాత హెచ్చరికల ధోరణి మళ్ళీ కనిపిస్తోంది. ఇది చూస్తుంటే ఆయన రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అయిపోయారని, ఇకపై ఆయనపై ఉన్న పాత కేసుల ఫైళ్లను దుమ్ము దులిపే సమయం ఆసన్నమైందని గుర్తిస్తున్నారు.
నాని తన మెడికల్ షీల్డ్ ను పక్కన పెట్టి మళ్ళీ సవాళ్లు విసురుతుండటంతో, కూటమి ప్రభుత్వం ఇక ఉపేక్షించేలా లేదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు చూపిన మానవత్వం అయిపోయిందని, ఇప్పుడు ఆయన రాజకీయ క్రీడలోకి దిగారు కాబట్టి అసలు కథ ప్రారంభించాలని కార్యకర్తలు కోరుతున్నారు. గత ఐదేళ్లలో నాని హయాంలో గుడివాడలో జరిగిన అక్రమాలు, వ్యక్తిగత దూషణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎన్నో అవకాశాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఏం చేయబోతున్నారో మరి!?


