క్యాలెండర్ లో పండుగలు కనిపించడమే ఆలస్యం… వాటిని అధికారికంగా నిర్వహించేయడం అధికార పార్టీలకు అలవాటైపోయింది! పండుగల్లోకి కూడా రాజకీయ ప్రయోజనాలను చొప్పించేశారు. చివరికి, సంక్రాంతి ముగ్గుల పోటీలూ గొబ్బెలూ భోగిమంటలు కూడా అధికార పార్టీ వారే వేస్తున్న వైనాన్ని గత రెండేళ్లుగా చూస్తున్నాం. అయితే, పండుగలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్న అధికార పార్టీ వారు… ఎందుకో ‘వనభోజనాలు’ అంటే మాత్రం భయపడిపోతున్నారు! ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. అత్యంత పవిత్రమైన మాసంగా ఎంతో భక్తి ప్రపత్తులతో భక్తులు పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే వన భోజనాలు కూడా పెట్టుకుంటారు. వన భోజనాలు అంటే… అందరూ కలిసి ఒకేచోట భోజనం చేయడం! సరే, ఆ కన్సెప్ట్ ను కూడా కులాలకు అనుకూలంగా ఎప్పుడో మార్చేశారు. వన భోజనాల్లోకి కుల సంఘాలు ఎంట్రీ ఇవ్వడంతో… ప్రస్తుతం కులాల వారీగానే వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా కులాలకు చెందిన రాజకీయ ప్రముఖులను అతిథులుగా పిలవడం, వారు వచ్చి భోజనాలు చేయడం… షరా మామూలు అయిపోయింది.
అయితే, ఈ ఏడాది తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నాయకుడూ వనభోజన కార్యక్రమాల్లో పాల్గొనరు! అలా వెళ్లకూడదని పార్టీ అధిష్ఠానమే ఆదేశించిందని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారి పార్టీ అనే ఓ ముద్ర పడిపోయింది. ఇంకోపక్క, కాపులను ఏకం చేస్తూ ముద్రగడ ఉద్యమిస్తున్నారు. బీసీ, ఎస్సీలను ప్రతిపక్ష నేత జగన్ ఆకర్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వనభోజనాలకు నాయకులు వెళ్తే.. తెలుగుదేశం మీద ఉన్న ఆ ముద్రను తుడుచుకోవడం కష్టం అవుతుందని అధినాయకత్వం భావించిందట. తెలుగుదేశం కమ్మవారి పార్టీ అనే ముద్ర నుంచి అందరి పార్టీ అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఉందనీ, అందుకు వనభోజనాలకు ఎమ్మెల్యేలుగానీ, మంత్రులుగానీ, ఇతర నాయకులుగానీ వెళ్లకూడదని ఆదేశించినట్టు చెబుతున్నారు.
అయినా, వన భోజనాలకు వెళ్లనంత మాత్రన పార్టీ మీద ఉన్న కులముద్ర పోతుందా..? ఒకవేళ అలాంటి ముద్ర పోగొట్టుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే… అధికార పార్టీ వారే వనభోజనాలు నిర్వహిస్తే సరిపోయేది! అన్ని కులాలవారికీ సమారాధన చేస్తే బాగుండేది. సర్కారువారి పథకాల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాన్లో కొంత సొమ్ముతో అన్నదానం చేస్తే మంచిదే కదా! అంతేగానీ, ఇలాంటి ఆదేశాలను జారీ చేస్తూ… తెలుగుదేశం ఫలానా కుల పార్టీ అని వారే చాటింపు వేసుకుంటున్నట్టుగా లేదూ!!