పిల్లల మానసిక ఆరోగ్యం ,భద్రతను దృష్టిలో ఉంచుకుని, 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా వ్యసనం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతినడమే కాకుండా, వారు సైబర్ వేధింపులకు , ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల డేటాను ఏఐ శిక్షణ కోసం పెద్ద కంపెనీలు వాడుకుంటున్నాయని, దీనివల్ల వారి గోప్యతకు భంగం కలుగుతోందని ఆయన బిల్లులో పేర్కొన్నారు.
ఎంపీ లావు ..తాను ప్రతిపాదించిన బిల్లులలో సోషల్ మీడియా సంస్థలు మెటా , ఎక్స్ , గూగుల్ వయస్సును ధృవీకరించే బాధ్యతను తీసుకోవాలని పేర్కొన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఈ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయకుండా కఠినమైన సాంకేతిక నిబంధనలను అమలు చేయాలని ఎంపీ సూచించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇలాంటి వయస్సు పరిమితులను అమలు చేస్తున్నాయని, మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఏకరీతి విధానం రావలసిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులకు తమ పిల్లల డిజిటల్ కార్యకలాపాలపై అవగాహన కల్పించడంతో పాటు, టెక్ కంపెనీలను జవాబుదారీగా చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ఎంపీ లావు చెబుతున్నారు. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగి, కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. నారా లోకేష్ ఇప్పటికే ఏపీలో ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అమలు చేయడం చాలా కష్టమని దేశమంతా నిర్ణయం తీసుకుంటే బాగుటుందని లావు అభిప్రాయం. ప్రైవేటు బిల్లులు పాస్ కావడం దాదాపుగా అసాధ్యం. అయితే ఈ సమస్యపై దేశవ్యాప్త చర్చ జరుగుతుంది.