తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొంత మంది రాను రాను గోము పోతున్నారు. చంద్రబాబు, లోకేష్,ఎన్టీఆర్లను తిట్టారని చెప్పి ఎక్కడెక్కడి పోస్టులనో పట్టుకుని వచ్చి వారికి రీచ్ చేస్తున్నారు. అంతేనా వారిని సమాధానం చెప్పే పేరుతో జనసేన నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ వాదాలు రాను రాను పెద్దవయిపోయి.. తిట్ల దాకా వెళ్తున్నాయి. చివరికి అది పార్టీకి పని చేస్తే ఇలా చేస్తారా అన్నా అని లోకేష్ ను ట్యాగ్ చేసి తామేదో ఘనకార్యం చేశామని.. తమను ఎందుకు పట్టించుకోవడంలేదని లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం టీడీపీకి కొత్త సమస్యగా మారింది.
జనసేన పేరు పెట్టుకుని తిట్టిన అందరూ జనసైనికులేనా ?
జనసేనలో ఎలాంటి బాధ్యతలు లేని వాళ్లు.. జనసేన పేరు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్లకి రీచ్ తక్కువ. కానీ వారు ఇలా మాట్లాడారు అని చెప్పి పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వారు చేసిన కామెంట్స్ ను హైలెట్ చేసి…తిరిగి తిడుతున్నారు. దీని వల్ల వివాదం పెరిగిపోతోంది. వారు అలా టీడీపీని.. టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడానికి కారణం.. టీడీపీ సోషల్ మీడియా ఇస్తున్న రీచే. అంతే కాదు వారు వైసీపీని ఒక్క మాట అనరు. అక్కడే ఉన్న లాజిక్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వారు ఓ ఎజెండాతో పని చేస్తున్నారు. ఆ ట్రాప్ లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పడుతున్నారు.
బొండా ఉమలా జనసేన ఎమ్మెల్యే.. టీడీపీ మంత్రిపై మాట్లాడితే ?
బొండా ఉమ విషయంలోనూ ఇదే జరిగింది. బొండా ఉమ పవన్ కల్యాణ్ కూడా సన్నిహితుడే. ఆయన మాట్లాడే మాటలను మరింత జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంది. అలాంటి మాటల్ని జనసేన ఎమ్మెల్యే అధికార పార్టీ మంత్రి మీద అని ఉంటే.. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇంకా ఎక్కువ స్పందించేవారు. జనసేన కార్యకర్తలు బొండా ఉమ విషయంలో అలా స్పందించడం వింత కాదు. ఆయన మాట్లాడింది నేరుగా పవన్ కల్యాణ్ మీద. తాను చేసిన తప్పేమిటో బొండా ఉమ తెలుసుకుని వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అన్న మాటలు మాత్రం.. చరిత్రలో నిలిచిపోతాయి. అవసరమైనప్పుడల్లా తెరపైకి వస్తాయి. ఇక్కడ బొండా ఉమను సమర్థించాల్సిన అవసరం లేదు.
సరైన దారిలో పెట్టాల్సిన అవసరం !
అలాగని బూతులు తిట్టిన వారిని తిరిగి అంత కంటే ఎక్కువ బూతులు తిట్టడం అభిమానం కాదు. రెండు వర్గాలకూ ఇప్పటికీ తెలుసుకోలేని విషయం ఏమిటంటే.. వారు నేరుగా టార్గెట్ చేస్తోంది తమ అధినేతల్నే. వారు ఒకటి అంటే.. వీరు రెండు అంటారు.. ఆ మాటలన్నీ అధినేతల కుటుంబాలనే. వ్యక్తిగతంగా వీరు..వారూ అనుకోరు. ఈ విషయం గుర్తించలేకపోతున్నారు. టీడీపీ సోషల్మీడియాలో చాలా మంది చదువుకున్న వారు, స్వచ్చందంగా పని చేస్తున్న వారు ఉన్నారు. వారు ఇలా బూతుల ట్రాప్ లో పడటం మాత్రం సమస్యే. నారా లోకేష్ ఈ విషయంలో వారందరితో ఓ సారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.