తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడేం చేస్తున్నారు ?. ఈ ఒక్క ప్రశ్న వేసుకుని సోషల్ మీడియాలోకి తొంగి చూస్తే.. ఒకప్పుడు ఎంతో పోరాడిన వాళ్లు ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరికి నారా లోకేష్ కూడా అసంతృప్తికి గురవుతున్నారు. వారి ఫ్యాన్ వార్స్, అవసరం లేని వివాదాలు, రాజకీయాలకు సంబంధం లేని ఈగోలతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. సమయాన్ని వృధా చేసుకుని స్పేసుల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రావడంతో నారా లోకేష్ .. ఇప్పటి వరకూ తాను ఫాలో అవుతున్న వారిని అన్ ఫాలో కొడుతున్నారు. అయినా వారు జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
టీడీపీ ఇండిపెండెంట్ సైన్యం
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ చాలా బలంగా ఉండేది. ఆ పార్టీ బలం పెయిడ్ మీడియా కాదు. రాబిన్ శర్మ నేతృత్వంలోని ఏజెన్సీ ఎలాంటి నేరెటివ్స్ డిజైన్ చేసేదో కానీ.. అది కేవలం పార్టీ లైన్ లో ఉండేది. కానీ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ట్రెండ్ కు తగ్గట్లుగా సొంత నెరేటివ్ ను క్రియేట్ చేసుకుని దానికి తగ్గట్లుగా వైసీపీపై పోరాడేవారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న తరహాలో వైసీపీకి కౌంటర్ ఇచ్చేవారు. వారు పార్టీ లైన్ లో ఉండకపోవడంతో వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదంతా చెల్లింది . కానీ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చారు.
అధికారంలోకి వచ్చాక ఫ్యాన్ వార్స్, అవసరం లేని వివాదాలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షం అన్న మూడ్ లోనే ఉన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు. జనసేన పేరుతో ఎవరైనా టీడీపీ పై.. ప్రభుత్వంపై.. కామెంట్ చేస్తే రెచ్చిపోతున్నారు. జనసేన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రతి చిన్న వ్యక్తిని పెద్ద వారిని చేయాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ల ఊళ్లో పది మందికి తెలియని వ్యక్తిని ట్విట్టర్ లో ఏదో అన్నాడని చెప్పి.. ఫేమస్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇదే అదనుగా జనసేన పేరుతో టీడీపీపై, ఎన్టీఆర్ పై , లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్లు పెరిగిపోయారు. ఈ పరిస్థితి తామే కారణం అని.. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గుర్తించడం లేదు. తాము చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఫలితంగా వారంతా వేరే ట్రాక్ లోకి వెళ్లిపోయారు.
పార్టీ కోసం పని చేయాలని కోరుకునే లోకేష్
నారా లోకేష్ జీవితంలో సొంతంగా ఎదిగిన వారు అభిమానంతో టీడీపీకి పని చేయడాన్ని స్వాగతించారు. వారందరినీ ఫాలో అయ్యారు. ఆ స్ఫూర్తిని వారు కొనసాగించాల్సి ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షాలతో ఫ్యాన్ వార్స్ పెట్టుకోకుండా… పనికి మాలిన వివాదాలను తెరపైకి తీసుకు రాకుండా.. ఉండాలని.. ప్రభుత్వం చేసే మంచిని ప్రచారం చేయాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా సైన్యం దాన్ని మర్చిపోయింది. ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. ఇక వారు దారికి రారని అనుకుంటున్నారేమో కానీ.. నారా లోకేష్ కూడా అన్ ఫాలో కొడుతున్నారు.