కడపలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరాటంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సీట్లలో కూటమి ఏడు స్థానాల్లో గెలిచింది. గెలవాల్సిన రాజంపేటలో ఓడిపోయామని చంద్రబాబు పార్టీ నేతలపై ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం మరింతగా పెరిగింది కానీ తగ్గలేదు.
ఇటీవల వైసీపీ నేతలపై కేసులు పెట్టారని సీఐని వీఆర్‌కు పంపారని ప్రచారం జరిగింది. ఈ విషయం చర్చనీయాంశం అయింది. అసలేం జరిగిందో.. ఆ సీఐను వీఆర్‌కు పంపడానికి కారణం ఎవరో పార్టీలో అంతర్గతంగా అందరికీ తెలుసు. అంతా గగ్గోలు రేగడంతో సాయంత్రానికి ఆ సీఐకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈ ఘటన .. ఆధిపత్య పోరాటం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తోంది.
కడపలో కొంత మంది టీడీపీ నేతలు గీత దాటిపోతున్నారు. వారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పోరాడారో ఎవరికీ తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం దున్నేయడానికి సిద్ధపడుతున్నారు. ఇతర పార్టీ నేతల్ని లెక్క చేయడం లేదు. వారికి వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే.. ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకోవడానికి ప్రయత్నించడం మాత్రం వివాదాస్పదం అవుతోంది.
కడపలో రాజకీయాలు చేయాలంటే.. డైనమిక్ నేచర్ ఉండాలి. అలాంటి నేచర్ ఉన్న వారిని ప్రోత్సహించి.. అడ్డగోలుగా రాజకీయం చేసే వారిని.. సీనియర్లు అయినా సరే వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సానుభూతిపరులు అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకోవాల్సిందిగా పోయి.. ఇలా అధికార ప్రాబల్యం కోసం పార్టీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనుకుంటున్నారు. మరి పెద్దలు దృష్టిపెడతారా ?