”ఇస్తానని నమ్మించి మోసం చేశారు” తెలుగుదేశం నుంచి రాజ్యసభకు టికెట్ రానందుకు ఆపార్టీ సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి జె ఆర్ పుష్పరాజ్ బహిరంగంగా వెలిబుచ్చిన అసంతృప్తి, ఆక్రోశం ఇది.
“ప్రతీ ఒక్కరికీ పదవులు ఇవ్వలేము…సామాజిక న్యాయం వుండేలా ప్రాతినిధ్య వ్యవస్ధను నిర్మిస్తున్నాము…ఇది అర్ధం చేసుకుని సహకరించాలి” ఇది ప్రతీసారీ చంద్రబాబు నాయుడు చెప్పే మాటే!
ఇపుడు తెలుగుదేశం రాజ్యసభకు పంపుతున్న సుజనా చౌదరి, టిజి వెంకటేష్… ఈ ఇద్దరూ కార్పొరేట్ రంగం ప్రతినిధులే! 35 ఏళ్ళక్రితం తెలుగుదేశం పుట్టినప్పటినుంచీ ఎన్ టి ఆర్ సారధ్యం సాగినంత వరకూ పార్టీలో, ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరిగేలా ప్రాతినిధ్యం వుండేది. బడుగు బలహీన వర్గాల వారికి హెచ్చు ప్రాతినిధ్యం వుండేది. ఇప్పటికీ బిసిలు తెలుగుదేశం ఓటు బ్యాంకుగా వున్నారంటే అందుకు మూలకారణం ప్రాతినిధ్య వ్యవస్ధలో సమతూకాలు దెబ్బతినకుండా నిర్వహించుకుంటూ వుండటమే!
దేశమంతటా అన్నిపార్టీలూ అటూ ఇటూగా ఈ విధానాన్నే కొనసాగిస్తున్నాయి.
సరళీకృత ఆర్ధిక విధానాలు లేదా ప్రయివేటీకరణ అమలు వేగం పెరిగాక ఏపార్టీ అధికారంలో వున్నా కూడా అన్ని రాష్ట్రాలూ కార్పొరేట్ రంగం మద్దతు బహిరంగంగానే తీసుకుంటున్నాయి. ఆరంగం వారు పార్లమెంటరీ రాజకీయాల్లోకి ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా రావడం కూడా మొదలైంది. అయితే ఎంపిక ద్వారా ఆ రంగం ప్రతినిధులను తీసుకోవలసి వచ్చినపుడు వారిని రెండవ లేదా మూడవ వరుసలోనే నిలబెట్టడం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదే!
పదేళ్ళ అనంతరం తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు సామాన్య ప్రజలతో ఏ సంబంధమూ లేని నారాయణను మంత్రిని చేశారు. ”సొంత మనిషి, ఇష్టుడు, కష్టకాలంలో ఆర్ధికంగా పార్టీని ఆదుకన్నవాడు, నమ్మకస్తుడు, విధేయుడు” కాబట్టే నేరుగా మంత్రి అయిపోయారన్న వ్యాఖానాలు నిజమే కావచ్చు! ఆవెనుక ఇద్దరికీ సంబందించిన ఒక కామన్ వేవ్ లెంగ్త్ గట్టిగా పని చేసింది! అదే ”మార్కెట్ ఎకానమీ”.
కేంద్రమంత్రిగా వుండి అప్పు ఎగవేత కేసులో నాన్ బెయిలబుల్ వారంటు అందుకున్న సుజనా చౌదరిని రెండోసారి రాజ్యసభకు ఎంపిక చేయడంలో కూడా ఈ సూత్రమే గట్టిగా పని చేసింది. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి, క్రియాశీలక రాజకీయాలకు దూరమైపోయిన జికె వెంకటేష్ రాజ్యసభ కు ఎంపిక కావడం వెనుక సూత్రం కూడా ఇదే! పెట్టుబడుల కోసం కార్పొరేట్ రంగంతో, ప్రభుత్వంతో లాబీ చేయడానికి ఇలాంటి కార్పరేట్ రంగ ప్రాతినిధ్యమే రాష్ట్రానికి అవసరమని తెలుగుదేశం అధ్యక్షుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారని అర్ధమౌతోంది.
తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి ”మైండ్ సెట్ మార్చుకోవాలని” చంద్రబాబు పదేపదే చెబుతూంటారు. అదేజరిగితే పుష్పరాజ్ లాంటి ఎందరో తమకు న్యాయం జరగలేదని ఆక్రోశించే పని వుండదు…నారాయణ, సుజనాచౌదరి, వెంకటేష్ వంటి వారు కార్పొరేట్ ప్రయోజనాలను చక్కగా నెరవేర్చే సమర్ధులే కావచ్చు. దాని ఫలితాలు ప్రజలకే అందాలనుకున్నప్పుడు
వీరికి ప్రజాజీవనంలో లోతుపాతులు తెలవక పోవడమే పెద్ద సమస్య! మంత్రి గా కూడా వున్న పుష్పరాజ్ కే మోసపోయానన్న బాధ వుంటే అధికారపదవిలో ఒక్క అవకాశమూ లేకుండా ఏదో ఒకనాటికి ఆశ నెరవేరుతుందని భుజాలు అరిగిపోయేలా మోసే వారి భవిష్యత్తేమిటన్నదే అసలు సమస్య!