ప్రొ.నాగేశ్వర్: విభజన సెంటిమెంట్ రెచ్చగొడుతున్న టీఆర్ఎస్, టీడీపీ..!

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్రా విభజన గాయాల్ని మళ్లీ రగిలించే ప్రయత్నాలు జరిగాయి. ఇవి అటు టీడీపీ నుంచి ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా జరిగాయి. అవిశ్వాస తీర్మానం పెట్టింది.. రాష్ట్ర విభజన గురించి కాదు. ప్రత్యేకహోదా గురించి అవిశ్వాస తీర్మానం పెట్టారు.

విభజన అంశాలపై గల్లా ప్రసంగం ప్లానేనా..?

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంపై తెలంగాణలోనూ వ్యతిరేకత లేదు. అలాంటి సందర్భంలో… టీడీపీ తరపున మాట్లాడిన గల్లా జయదేవ్… రాష్ట్ర విభజన గాయాలను రేపారు. తెలంగాణతో పోల్చి ఇంత దారుణంగా అన్యాయం చేశారని ప్రసంగించారు. ఇదంతా పార్టీ నిర్ణయమే అనుకోవాలి. చాలా స్పష్టంగా ఎన్నికల సమయం వచ్చే సరికి విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేకహోదా కన్నా.. విభజన అంశాన్నే హైలెట్ చేయడానికి ప్రయత్నం జరిగింది. నిజానికి ప్రత్యేకహోదా విషయాన్ని బలంగా వినిపించడానికి టీడీపీ ఇంకా స్కోప్ ఉంది. ప్రత్యేకహోదాను ఏపీకి ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు కూడా సమర్థించారని టీడీపీ చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. హైదరాబాద్ ఉన్న ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. ఏపీకి జరిగే నష్టాన్ని పూడ్చడానికి మీరేమైనా చేయండి అని తెలంగాణ ఉద్యమకారులు చెప్పుకొచ్చారు. అయినా… తెలుగుదేశం పార్టీ … విభజన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. నిజంగా అనైతికంగా విభజన జరిగి ఉంటే..నాలుగేళ్ల పాటు ఎన్డీఏలోఉన్న టీడీపీ ఆ చట్టాన్ని సవరించేందుకు ప్రయత్నం చేయలేదు కదా..!. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా ఉన్న నిబంధనల్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. కేంద్రం వినదనుకుంటే.. ప్రైవేటు బిల్లు అయినా పెట్టి.. సవరణ సూచించుకోవాలి కదా..!. ఈ నాలుగేళ్ల కాలంలో టీడీపీ.. విభజన చట్టంలోని ఫలానా అంశం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని.. ఎక్కడా చెప్పలేదు. ప్రైవేటు బిల్లు ఆమోదం పొందకపోవచ్చు కానీ.. ప్రయత్నం చేసినట్లు ఉండేది కదా..!. అలా చేయలేదు.

గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్‌ ఎందుకు అంతగా స్పందించింది..?

ఒక్క టీడీపీనే కాదు.. టీఆర్ఎస్ కూడా అదే పని చేసింది. ఏడు ముంపు మండలాలు మళ్లీ మాకు కావాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మోడీ అధికారం చేపట్టిన తొలి సమావేశంలో… ముంపు మండలాల్ని ఏపీలో కలిపారు. టీఆర్ఎస్ ఆ నిర్ణయాన్ని ఎక్కడా వ్యతిరేకించలేదు. నిరసనలు తెలుపలేదు. కనీస నిరసన కూడా… పార్లమెంట్‌లో ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఎంపీలు చేయలేదు. మస్లిం రిజర్వేషన్ల బిల్లు కోసం… టీఆర్ఎస్ ఎంపీలు.. బడ్జెట్ సెషన్లో సభను స్తంభింపచేశారు. నిజానికి ఆ అంశం సుప్రీంకోర్టుకు సంబంధించినది. యాభై శాతం రిజర్వేషన్లు కన్నా మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ..సభను స్తంభింపచేశారు. కానీ… ఏడు ముంపు మండలాల కోసం… టీఆర్ఎస్ ఎందుకు సభను స్తంభింప చేయలేదు..? ఎందుకు నిరసన తెలియజేయలేదు..? ఎందుకు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయలేదు. ఇంత కాలం ఎలాంటి నిరసన తెలియజేయకుండా.. ఇప్పుడు ఆ ఏడు ముంపు మండలాల్ని మళ్లీ తిరిగివ్వాలి అంటున్నారు. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అయినా ఈ అంశాన్ని లెవనెత్తారు.

ప్రత్యేకహోదాకు మద్దతుపై ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు..?

ఇదే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడానికి మేము అనుకూలమే అని కేసీఆర్ చెప్పారు… కవిత చెప్పారు. ఇంత ఓపెన్ గా స్పెషల్ స్టేటస్‌కు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే పరిశ్రమలు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరి పరిశ్రమలు తరలిపోతాయని తెలిసే.. ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతు తెలిపారా..?. సీమాంధ్ర ప్రజల కాలిలో ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్న మాటలు మర్చిపోయారా..?. ఇవన్నీ మర్చిపోయి.. ఇప్పుడు విభజన సమస్యలన్నింటినీ లేవనెత్తుతున్నారు. గల్లా జయదేవ్.. విభజనపై మాట్లాడితే..టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున గొడవ చేశారు.

మోడీని కేసీఆర్ ఎందుకు పొడిగారు..?

ప్రధానమంత్రి కూడా.. కేసీఆర్ ను పొగిడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. తెలంగాణతో గొడవలు పెట్టుకుని… తమ దగ్గరకు వస్తూంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మెచ్యూరిటీతో వ్యవహరించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. టీఆర్ఎస్‌కు మెచ్యూరిటీ లేదంటారు. రాంమాధవ్ “మగతనం” లేదన్నారు. కానీ ప్రధాని మాత్రం పొగిడేశారు. దీని వల్ల టీఆర్ఎస్ – బీజేపీ సంబంధాలపై క్లారిటీ ..మరొకటి.. టీడీపీ, టీఆర్ఎస్ విభజన అంశాలను ముందుకు తీసుకు వస్తున్నాయని అనుకోవచ్చు. టీఆర్ఎస్ పుట్టి, పెరిగి, అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది.. తెలంగాణ సెంటిమెంట్. ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ వాదం వల్లే.. టీఆరెఎస్‌కు 63 సీట్లు వచ్చాయి. పార్టీ బలంగా ఉండి ఉంటే.. 2014లో వంద సీట్లు వచ్చేవి. ఆంధ్రా ఏజెంట్లు అంటూ విమర్శలు చేసినా.. టీడీపీకి పదిహేను సీట్లు వచ్చాయి.

సెంటిమెంట్ రెచ్చగొడితేనే ఓట్లు వస్తాయనుకుంటున్నారా..?

అందుకే టీఆర్ఎస్.. ఇప్పుడు ప్రభుత్వ విధానాలు చెప్పుకోవడం ద్వారా మాత్రమే ఓట్లు రావు… మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే గెలుస్తామనే అంచనాలకు వచ్చినట్లు ఉంది. గతంలో గ్రేటర్లో గెలుపు కోసం ప్రత్యేకహోదాకు మద్దతిచ్చారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాజేసినా.. సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్‌కే ఓటు వేస్తారని భావిస్తూ ఉండవచ్చు. టీడీపీ బలహీనపడింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు వేయరు. ఒక వేళ టీడీపీకి వేసినా.. పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు. అందుకే సీమాంధ్ర ఓటర్లపై టీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుని… తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకుని ఇతర ప్రాంతాల్లో ఓట్లు పొందాలనుకుంటోంది. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌తో పంచాయతీలు పెంచుకుంటేనే ఓట్లు వస్తాయనే వైఖరి తీసుకున్నట్లు కనిపిస్తోంది. హఠాత్తుగా డిమాండ్లు చేయడమే దీనికి కారణం. నిజానికి డిమాండ్ చేయాలనుకుంటే.. యూపీఏ ప్రభుత్వం ఇచ్చి.. ఎన్డీఏ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కోసం పోరాటం చేయాలి. కాళేశ్వరం జాతీయ హోదా కోసం పోరాటం చేయాలి. కానీ కేంద్రం చేయలేని..ముస్లిం రిజర్వేషన్ల కోసం సభలో ఆందోళన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు పరిశ్రమ కోసం అందరూ పోరాడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఒక్క పోరాటం కూడా లేదు. వీటన్నింటి అర్థం ఒకటే.. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని టీఆర్ఎస్ 2019లో గెలవాలని ప్రయత్నం చేస్తోంది.

గత ఎన్నికల నాటి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారా..?

అలాగే టీడీపీ కూడా.. 2014లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ముఖ్య కారణం.. ” ఒక భయానక వాతావరణన్ని – ఒక సుందరమైన స్వప్నాన్ని” ఏక కాలంలో చంద్రబాబు నాయుడు ఎఫెక్టివ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. భయానకదృశ్యం ఏమిటంటే… రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.. కట్టుబట్టలతో పంపించారు.. అనేది.. ఇక సుందరస్వప్నం ఏమిటంటే.. హైదరాబాద్ తలదన్నెలా… ఓ సిటీ కడతామని చెప్పారు. అమరావతిలో అనుకున్న విధంగా జరగలేదు కాబట్టి.. ఆ భయానక దృశ్యాన్ని చూపించడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ రెచ్చగొట్టడం ద్వారా… రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు సెంటిమెంట్ పండించడానికి సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com