ఇదివరకటితో పోలిస్తే టాలీవుడ్ లో స్టార్ వార్స్ కాస్త తగ్గినట్టే అనిపించింది. ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేయడం, ఒకరి ఫంక్షన్‌కి మరోకరు రావడం.. వీటి వల్ల వాతావరణం కాస్త కూల్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ వార్స్ మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. కాకపోతే చిన్న చిన్న కారణాలకే సోషల్ మీడియా సాక్షిగా తిట్టుకొంటు.. కొట్టుకొంటూ.. ట్రోల్ చేసుకొంటున్నారు. సంబంధం లేని విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు.
అసలు విషయానికొస్తే రీసెంట్ గా తేజా సజ్జా.. మహేష్ – రాజమౌళి సినిమా గురించి ప్రస్తావిస్తూ ‘SSRMB…’ అన్నాడు షార్ట్ కట్ లో. ఇది మహేష్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. SSMB 29 అనొచ్చు కదా? అనేది వాళ్ల వాదన. అంటే మహేష్ కంటే ముందుగా రాజమౌళి పేరు వాడినందుకు వాళ్లకు కోపం అన్నమాట. రాజమౌళి సినిమాలో మహేష్ చేస్తున్నాడు అనడానికీ, మహేష్ బాబు సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు అనడానికీ పెద్ద తేడా లేదు. కానీ.. ఈ చిన్న పాటి విషయాలే హీరోల అభిమానులు పట్టించుకొంటుంటారు. అందుకే మహేష్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు తేజా సజ్జాపై పడ్డారు. కెన్యా ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ ని SSMB 29 అని ప్రస్తావించింది.. నువ్వెంత? అనే టైపులో సోషల్ మీడియాలో తేజాని ట్రోల్ చేస్తున్నారు.
అయితే తేజాకు సోషల్ మీడియాలో గట్టి సపోర్టే దొరుకుతోంది. తేజా మాట్లాడిన దాంట్లో తప్పేముంది? రాజమౌళి క్రేజ్ అలాంటిది కదా? అంటూ వెనకేసుకొని వస్తున్నారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే – వాళ్లంతా తేజాని సపోర్ట్ చేస్తున్నట్టే చేసి, మహేష్ ఫ్యాన్స్ ని బాగా ఉడికిస్తున్న సంగతి అర్థం అవుతుంది. గుంటూరు కారం సమయంలో హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే. అప్పట్లో మహేష్ సినిమాకు పోటీగా వస్తున్నావ్.. జాగ్రత్త అంటూ మహేష్ ఫ్యాన్స్ తేజాని ఓ రేంజ్ లో ఆడుకొన్నారు. కానీ గుంటూరు కారం వసూళ్లని దాటుకొంటూ హనుమాన్ ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాగా మారిపోయింది. ఆ కోపం.. అప్పటి అసహనం ఇప్పటికీ మహేష్ ఫ్యాన్స్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. దాన్ని మిగిలిన హీరోల ఫ్యాన్స్, యాంటీ మహేష్ ఫ్యాన్స్ క్యాష్ చేసుకొంటున్నారు. తేజాని అడ్డం పెట్టుకొని, మహేష్ అభిమానుల పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. అప్పట్లో గుంటూరు కారం – హనుమాన్ పోటీ పడి, అందులో హనుమాన్ విరుచుకుపడిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు అప్పటి గుంటూరు కారం – హనుమాన్ ఫైట్ కూ ఇప్పటి కామెంట్లకు ఏమాత్రమైనా సంబంధం ఉందా, లేదా? అనే దిశగా మహేష్ ఫ్యాన్స్ ఆలోచించడం లేదు.
బాల నటుడిగా 50 సినిమాలు చేసి, హీరోగా ఒకొక్కమెట్లూ ఎదుగుతూ, ఈరోజు పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు తేజా సజ్జా. మహేష్ తో కూడా నటించిన అనుభవం తేజాకు ఉంది. అలాంటప్పుడు తేజాని పరాయివాడిలానో, శత్రువులానో చూడడం మంచి పద్ధతి కాదు. ఎవరో ఏదో అన్నారని, ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్నీ గ్రహించలేక, కావాలని ఇలా ఫ్యాన్ వార్ ప్రేరేపిస్తున్న వాళ్ల అసలు ముసుగు అర్థం చేసుకోలేక ఓ హీరోని ఎటాక్ చేయడం ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు. ఈ విషయాన్ని మహేష్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకొంటే బాగుంటుంది.