తేజా సజ్జా తన కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ‘హనుమాన్’ తరవాత ఎన్ని ఆఫర్లు వచ్చినా.. ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. ఎక్కడా టెమ్ట్ అవ్వకుండా మంచి కథల్ని ఎంచుకొంటున్నాడు. తన చేతిలో ఇప్పుడు ‘మిరాయ్’ వుంది. ఈ సినిమా తరవాత రెండు ప్రాజెక్టుల్ని సెట్ చేసుకొన్నాడు. అందులో ఓ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వచ్చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. విడుదల తేదీ కూడా ఫిక్స్ చేశారు. 2027 సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని మేకర్స్ ముందే చెప్పేశారు. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో ‘ఫ్రమ్ రాయలసీమ టూ ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ ఓ క్యాప్షన్ యాడ్ చేశారు. ఈ క్యాప్షన్‌ని డీ కోడ్ చేస్తే ఇది ‘జాంబిరెడ్డి 2’ అని అర్థం అవుతోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జాంబిరెడ్డి’ మంచి హిట్. జాంబీ జోనర్లో వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. దానికి సీక్వెల్ కథ ప్రశాంత్ వర్మ రెడీ చేశారు. దాన్నే ఇప్పుడు పట్టాలెక్కించబోతున్నారు. ‘జాంబిరెడ్డి’ కథ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. పార్ట్ 2 కాబట్టి.. ఈసారి యుగాంతం వైపు కథ మరలుస్తున్నారు. ఫస్టాఫ్ అంతా రాయలసీమలో జరిగితే.. సెకండాఫ్ లో యుగాంతం ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడం లేదు. ఆ దర్శకుడెవరన్నది త్వరలో తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ చేతిలో ‘జై హనుమాన్’ సినిమా ఉంది. ప్రస్తుతం ఆయన దానిపై ఫోకస్ చేస్తున్నారు.