బీహార్‌లో ఎలాగైనా ఈ సారి అధికారం పొందాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్..తమ కూటమి మేనిఫెస్టోను ప్రకటించారు. తేజస్వీ కా ప్రాణ్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో ఉన్న పథకాలు .. ఏవీ అక్కడి ప్రజలను పైకి తీసుకు వస్తామని చెప్పేవి కావు.కానీ ప్రతి ఒక్కరికీ మేలు చేస్తామని ..ఉద్యోగాలు.. వేల జీతాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది కుటుంబానికో ఉద్యోగం.
25 ప్రధాన హామీలు – అన్నీ అతిశయమే !
ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోగానే చట్టం తీసుకువచ్చి, ప్రతి కుటుంబానికి ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. 20 నెలల్లో నియామకాలు ప్రారంభిస్తామని తేజస్వీ యాదవ్ చెబుతున్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమో మాత్రం ఆయన చెప్పలేదు. ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 చొప్పున సంవత్సరానికి రూ. 30,000 ఇస్తారు. డిసెంబర్ 1 నుంచి అమలు. చేస్తారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. దీన్ని ఇప్పటికే నితీష్ ప్రభుత్వం అమలు చేస్తోంది. స్వయం సహాయక బృందాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతం ఇస్తారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్స్ కార్మికులను కూడా రెగ్యులర్ చేస్తరు. పేదలకు రూ. 500కి గ్యాస్ సిలిండర్ సహా చాలా హామీలు ఇచ్చారు.
బీహార్ ను నెంబర్ వన్ గా మారుస్తామని ప్రకటన
లాలూ ప్రసాద్ యాదవ్ అరాచక రాజకీయం వల్లనే బీహార్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉందని ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు తేజస్వీ .. బీహార్ ప్రజల రాత మారుస్తామని .. రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని చెబుతున్నారు. ఐటీ పార్కులు, ఇండస్ట్రీలను తీసుకు వస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌ను వదిలేసింది. మేము మార్పు తీసుకువస్తామని చెబుతున్నారు.
మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరు కాని రాహుల్ గాంధీ
తేజస్వీ యాదవ్ తన పేరు మీదనే .. మేనిఫెస్టో విడుదల చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు. పవన్ ఖేడాను పంపారు. ఆయన స్థాయి మేనిఫెస్టోపై నమ్మకం పెంచేందుకు ఉపయోగపడదు. మేనిఫెస్టో బాధ్యత లేకుండా.. చూసుకునేందుకు రాహుల్ గాంధీ తప్పించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ,కర్ణాటకల్లో ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని అంటారని ఆయన హాజరు కాలేదు. ఇంటికో ఉద్యోగం అనేది అసాధ్యమని.. ఆయనకూ తెలుసునని అందుకే డుమ్మా కొట్టారని ఎన్డీఏ నేతలు అంటున్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలైన తర్వాత .. ఆశలతో ప్రజల్ని మోసం చేసే రాజకీయాలు బీహార్ లో మరింత ఊపందుకోనున్నాయి.
