శత్రువులు ఎక్కడో ఉండర్రా.. కూతుళ్లు , చెల్లెళ్లే రూపంలో మన ఇంట్లోనే ఉంటారు అని.. ఓ సినిమాలో డైలాగ్ రాజకీయాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి.. ఇప్పుడు బీహార్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇదే రాజకీయం నడుస్తోంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ..తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ట్విట్టర్లో ఆర్జేడీని, తేజస్వీని అన్ ఫాలో అయ్యారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆర్జేడీ కంగారు పడిపోతోంది.
లాలూ వారసుల్లో ఇద్దరు కుమారులే మొదట రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత రోహిణి ఆచార్య వచ్చారు. లాలూ కిడ్నీ సమస్యతో చావు బతుకుల్లో ఉన్నప్పుడు రోహిణి ఆచార్య తన కిడ్నీని దానం చేసి వార్తల్లోకి వచ్చారు. తండ్రిని బతికించుకున్నారు. రాజకీయాలపై ఆసక్తి లేని ఆమె .. ఆ తర్వాత రాజకీయంగా కీలకం అయ్యారు. గత లోక్ సభ ఎన్నికల్లో లాలూ ఎప్పుడూ పోటీ చేసే సీటు నుంచి పోటీ చేసినా బీజేపీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఇంకా యాక్టివ్ అయ్యారు. తేజస్వి పార్టీలో తన సోదరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సంజయ్ యాదవ్ అనే ఎంపీ, స్ట్రాటజిస్ట్ కే ప్రాధాన్యం లబిస్తోంది. దాంతో ఆమె అసంతృప్తికి గురవుతున్నారు.
ఇప్పటికే తేజస్వి అన్న తేజ్ ప్రతాప్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయన కూడా సోదిర రోహిణి ఆచార్యకు మద్దతు పలుకుతున్నారు. తన సోదరిని ఎవరైనా అవమానిస్తే సుదర్శన చక్రం ప్రయోగిస్తానంటున్నారు. తేజ్ ప్రతాప్ ఓ భిన్నమైన క్యారెక్టర్. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక లాలూ ప్రసాద్ చూస్తూండిపోతున్నారు. కుమార్తె , కుమారుల మధ్య రాజీ చేయడం లేదు. దాంతో రోహిణి ఆచార్య వ్యవహారం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారింది.