బీహార్లో ఇండియా కూటమి భారీ రాంగ్ స్టెప్ వేసింది. కూటమిని నడిపిస్తున్న లాలూ కూమారుడు తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఓటర్ల లిస్టు అంతా గోల్ మాల్ జరిగిందని..ఎన్నికలను బహిష్కరించే ఆలోచన చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇండియా కూటమితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎన్నికల బహిష్కరణ అనే పదం వాడితే ముందే ఓడిపోయినట్లుగా అంగీకరించినట్లు అవుతుంది. బీహార్ లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆర్జేడీ కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని సర్వేలు కూడా చెబుతున్న టైంలో .. లాలూ యాదవ్.. కుమారుడు ఎన్నికల బహిష్కరణ ఆలోచన ప్రకటన చేశారు. ఇది ఆ కూటమికి మైనస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
బీహార్ ఓటర్ల జాబితా సవరణ ఖచ్చితంగా వివాదాస్పదమే. కానీ అనర్హులైన వారిని తీసేయగలరు. ఇప్పుడు దేశం దృష్టి అంతా బీహార్ ఓటర్ల జాబితాపైనే ఉంది. అక్కడ అవకతవకలు జరిగితే … ఖచ్చితంగా దేశం అంతా స్పందిస్తుంది. ఇతర దేశాల వారు అక్రమంగా తరలి వచ్చి ఇక్కడ ఓటు వేస్తామంటే ఎవరూ అంగీకరించరు. అలాగే దొంగ ఓటర్లు.. బీహార్ లో లేని ఓటర్లనూ సహించరు. కానీ అర్హులైన వారికి ఓటు హక్కు లేకుండా చేస్తే మాత్రం దేశం అంతా ప్రతి స్పందిస్తుంది. అలాంటి పరిస్థితి తీసుకు రావాలి కానీ.. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఎన్నికల బహిష్కరణ చేస్తామని చెప్పడం .. ముందే చెతులెత్తేయడం అవుతుంది.
ఓటర్ల జాబితా సవరణ అంశం ఇప్పుడు బీజేపీకే మైనస్ అవుతుంది. జరుగుతున్న ప్రచారం వల్ల బీహార్ లో బీజేపీ గెలిచే పరిస్థితి లేదని అందుకే ఇలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మరింతగా రాజకీయం చేసుకోవాల్సిన తేజస్వి.. ఎన్నికల బహిష్కరణ ఆలోచన చేయడం.. సెల్ఫ్ గోల్ గా మారనుంది.