తెలకపల్లి రవి : అవిశ్వాసం అన్న కేంద్రాన్ని, కక్ష కట్టిన సిబిఐని వైసీపీ ఆశ్రయించడమేమిటి?

విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి తర్వాత తెలుగుదేశం అధినేత వైఖరిలో వూగిసలాట ఒకటైతే వైసీపీ పరిస్థితి అంతకన్నా దారుణంగా వుందనేది వాస్తవం. దాడి జరిగిన వెంటనే రోజా వంటివారు మాట్లాడిన దాన్ని వారి పత్రిక సాక్షిలోనే ఇవ్వలేదు. వెబ్‌సైట్‌లో ఇచ్చి సరిపెట్టారు. అంబటి రాంబాబు , శ్రీకాంత రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్‌ వంటివారితో పోలిస్తే ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా వున్నాయనేది కారణం కావచ్చు.బహుశా అందుకోసమే ఆంధ్రజ్యోతి వాటిని వివరంగా ఇచ్చింది. వాటికి జవాబు పేరుతో టిడిపి నేతలు ముఖ్యమంత్రితో సహా అసహనం తో స్పందించడం కూడా విమర్శలకు గురైంది. ఈ అసహనం వారికే పరిమితం కాకుండా ఖండించిన ఇతర పార్టీల నేతలకు కూడా వర్తింపచేయడం మరింత అభ్యంతరం తెచ్చిపెట్టింది. అయితే వైసీపీ ముఖ్యమంత్రి ఎ1 అనీ, డిజిపి ఎ2 అనీ ప్రకటించి ప్రచారంలో పెట్టడంతో వారిని బలపర్చే ప్రతిపక్షాలు కూడా లేకుండా పోయాయి. బిజెపి ఎంతో రభస చేసినా వైసీపీ వారిని కలిస్తే టిడిపి ఆరోపణలు నిజమవుతాయి గనక దూరంగానే పెట్టక తప్పలేదు.

ఇదే సమయంలో జగన్‌ ఎపి పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇవ్వకపోవడం విమర్శలు పెంచింది. కాని తర్వాత అదే పోలీసులు ఆయనను చంపడానికే దాడి జరిగిందని ఫిర్యాదు నివేదిక తయారు చేయడంతో సాక్షి పతాకశీర్సిక ఇవ్వక తప్పలేదు. కుట్ర కోణం పట్టించుకోలేదన్నది ఇప్పుడు వారి విమర్శ. దర్యాప్తు తదుపరి దశలో ఏం జరిగేది చూస్తే గాని ఈ విషయం చెప్పడం కష్టం. వారు చెప్పే ఎ1 ఎ2 వుండరని మాత్రం చెప్పొచ్చు. అదే వాదనతో వారు కేంద్రం ధర్డ్‌పార్టీతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరేందుకు వెళ్లారు. కాని ఇక్కడ రాజ్యాంగాంశాలే గాక రాజకీయ సమస్యలు కూడా వున్నాయి.

మొదటిది- మోడీ ప్రభుత్వంపై ఆరు మాసాల కిందటే వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ తరపున అవిశ్వాసం మూటకట్టుకున్న కేంద్రంపై ఈ విషయంలో విశ్వాసం ఎలా చూపగలుగుతారు? రెండవది- కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తమపై కక్ష కట్టిందనేది వైసీపీ పుట్టుక నుంచి చెబుతున్న మాట. మరి ఆ కేంద్ర సంస్థలనుంచి న్యాయం ఎలా ఆశించగలరు? పైగా సిబిఐలో రచ్చ తర్వాత ఎల్లోగేమ్‌ నడుస్తున్నట్టు ఈ మధ్యనే ఆరోపించారు. మూడవది- మాలాటి వాళ్లం ఈ వాదనలన్నీ లేవనెత్తాక వైసీపీ తర్కబద్దంగా మరో కొత్త కోణం తీసుకొచ్చింది. విమానాశ్రంలో భద్రతా దళం సిఐఎస్‌ఎప్‌ కేంద్రం అధీనంలో వుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు గనక వారిని కోరామంటున్నారు. అంటే మరివారికి తెలియకుండా ఈ కుట్ర జరిగివుంటుందని నమ్మడం ఎలా సాధ్యం? ముందే నివారించలేకపోయిన అసమర్థత మూట కట్టుకున్న వారు ఇప్పుడు సమర్థంగా విచారణ ఎలా చేయగలరు? నాల్గవది- కేంద్రంలో టిడిపి ఇప్పటికీ చక్రం తిప్పుతున్నదని అన్ని వ్యవస్తలు ఆడిస్తున్నదని సిబిఐ వివాదంలో కూడా వైసీపీ ఆరోపించింది. మరి అక్కడ మాత్రం ఎలా న్యాయం ఆశిస్తుంది? ఫెడరల్‌ విధానంలో రాష్ట్రాల వ్యవహారాలలో కేంద్రం జోక్యాన్ని ఆహ్వానించడం ఒక ప్రాంతీయ పార్టీగా వైసీపీకి కూడా నష్టం చేయదా?

తానే ముఖ్యమంత్రిని కాబోతున్నట్టు భావించే జగన్‌ గాని అయినట్టే భావించే ఆయన అనుయాయులు గాని రేపు తామ నడిపించాల్సిన పోలీసు వ్యవస్థపై లేదా రాష్ట్ర యంత్రాంగం మొత్తంపై అవిశ్వాసం ప్రకటించడం సమంజసమేనా? ఒక డిజిపిపైన లేదా ఎసిపిపైన నమ్మకం లేదనడం వేరు, వ్యవస్థనే అనుమానించడం వేరు. తద్వారా వారందరినీ దూరం చేసుకోవడం సరైందేనా?

అలాగే సోషల్‌ మీడియాను ఇరుపక్షాలు దుర్వినియోగం చేసి ఫోటోలమీద ఫోటోలు మార్ఫింగుల మీద మార్ఫింగులు చేస్తే గందరగోళం పెరగడం తప్ప దమ్మిడి ఉపయోగం లేదు. సానుభూతి కోసం దాడి అంటున్న మల్లెల బాబ్జి ఉదంతాన్ని ఇప్పుడు అదేపనిగా ప్రచారం చేయడం వైసీపీకి ఏం లాభం చేస్తుంది? దానివల్ల చంద్రబాబును ఎండగడుతున్నామనుకుంటున్నారు గాని వాస్తవంలో అప్పటికి కథానాయకుడు ఎన్టీఆరే కదా! సానుభూతి కోసం దాడుల వాదనే జగన్‌కు వ్యతిరేకంగా ప్రయోగిస్తున్న సందర్భం. తమ మీడియాలో గాని సోషల్‌ మీడియాలో గాని అనుకూల వ్యతిరేక వాదనలు గుప్పించేసి వాటినే మోత మోగించడం వల్ల ఏదో జరిగిపోతుందనుకోవడం వాస్తవికత కాదు. ఎబిఎన్‌లో వస్తే టిడిపికి ఏ మాత్రం మేలు జరుగుతుందో సాక్షిలో వచ్చినవన్నీ వల్లె వేస్తే వైసీపీకి అంతే జరుగుతుంది. మీడియా పని వేరు, పార్టీల పనివేరు. సత్యాసత్యాలు అలా వుంచితే ఆ ప్రచార ప్రయోజనాలు వేరు, నేతల పార్టీల బాధ్యతలు వేరు.

రాజకీయ స్పందనలు చూసిన తర్వాత తాము రాష్ట్రపతి పాలన కోరడం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేయడం మంచిదే. అది కుదిరేపని కాదు కూడా. అయితే కేంద్రం జోక్యం ఆహ్వానించడమంటే దాదాపు రాష్ట్రపతి పాలనకు ముందస్తు ఘట్టం లాటిది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల మద్దతుతో దాడిని ఖండింపచేసి సమగ్ర విచారణ జరగాలని కోరొచ్చు. లేదా హైకోర్టులో ఏదైనా జోక్యం కోరవచ్చు. అంతేగాని కేంద్రం ఏదో ఒరగబెడుతుందనుకోవడం హాస్యాస్పదం. వైసీపీ టీడీపీ మధ్య తన పబ్బం గడుపుకోవడమే కేంద్రం వ్యూహం.

జగన్‌పై దాడి దారుణమైంది, తేల్చవలసింది కూడా. కాని ఆ వివాదాల సవాళ్ల జడివానలో దారితప్పిపోకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిపై వుంది. దాడికి గురైన వారిపై మరింత ఎక్కువగా వుంటుంది. ఇప్పటికి చూస్తే మాత్రం వైసీపీ వైఖరిలో గజిబిజి తగ్గి స్పష్టత వస్తే గాని అది సాధ్యం కాదు.

-తెలకపల్లి రవి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ “రండ” రచ్చ !

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బీజేపీని కిషన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పిందని .. కానీ కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అయన...

పాజిటివ్ స్టెప్‌తో టీ కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ షాక్ !

కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు...

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ...

అత్యంత విష‌మంగా సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన...

HOT NEWS

[X] Close
[X] Close