కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమైతే కొంపలు మునగవు. ఆరోగ్యశ్రీ సేవల్ ఆగిపోతే పేద రోజుల పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు. తక్షణం చికిత్స అవసరమైన వారి ఆరోగ్యం విషమించ వచ్చు. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ విషయం కూడా గుర్తుకు రానట్టుంది. ఎంతసేపూ కొత్త జిల్లాల మోజే కనిపిస్తోంది.
తెలంగాణలో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. 200 ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ వైద్య సేవలు బంద్ అయ్యాయి. ఈ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ. 300 కోట్లు బకాయి ఉంది. లక్ష కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సంపన్న రాష్ట్రానికి ఇది భారం కాదు. వెంటనే చెల్లిస్తే సమస్యే ఉండదు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే, మన రాష్ట్రం మనకు వచ్చిందని ప్రజలు సంబరపడిన తర్వాత రెండేళ్లలో నాలుగైదు సార్లు ఈ పరిస్థితి వచ్చింది. తరచూ ఆరోగ్యశ్రీ బకాయిల కోసం సేవలు నిలిచిపోవడం షరామామూలుగా మారిపోయింది.
బంగారు తెలంగాణ అన్నా వజ్ర తెలంగాణ అన్నా, ముందు ప్రజల ఆరోగ్యం ముఖ్యం. వాళ్ల ఆరోగ్యం, భద్రత తర్వాతే ఏదైనా. కానీ, కనీసం రోడ్లకు గుంతలు పూడ్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వమిది. సంపన్న రాష్ట్రమని చెప్పుకుంటూ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదంటే తెలంగాణ దివాళా దశలో ఉందనే ప్రశ్న తలెత్తుతుంది.
సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తారని తెలుసు. దీనివల్ల పేద రోగులు ఇబ్బంది పడతారనీ తెలుసు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అధికారిక నివాసంలో ఐదు జిల్లా పార్టీ నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రజల ఆరోగ్యం గురించి కాదు. కొత్త జిల్లాల గురించి. అదే విచిత్రం. ముందు ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోకుండా చూసిన తర్వాత కొత్త జిల్లాలపై గంటలకొద్దీ చర్చించుకోవచ్చు కదా. దీనికి జవాబు దొరకదు.
ముఖ్యమంత్రి కోసం ఏడెనిమిది ఏళ్ల క్రితం కట్టిన కొత్త క్యాంప్ ఆఫీసు ఉంది. దాని వెనకే మరోటి నిర్మిస్తున్నారు. దీని అంచనా వ్యయం 35 కోట్లు. అంతా పూర్తయ్యే సరికి 40 నుంచి 50 కోట్లు ఖర్చు కావచ్చని తెలుస్తోంది. సచివాలయ భవనం చక్కగా ఉంటే కొత్త నిర్మాణాలకు వందల కోట్లు ఖర్చు పెట్టాలని సంకల్పించారు. ఆరోగ్యశ్రీ కింద 300 కోట్ల బిల్లులు కట్టడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
సంపన్న రాష్ట్రంలో ఈ దరిద్రం ఏమిటో అర్థం కాదు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే తరచూ వైద్య సేవలు ఆగిపోతున్నాయా అనేది కేసీఆర్ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడ సమస్య లేకపోతే తన సర్కార్ వైఫల్యం ఏమిటో గుర్తెరిగి లోపాలను సరిచేసుకోవాలి. ప్రశ్నించిన వాళ్లను విమర్శించడం పరిపాలన కాదు. సరైన దిశలా పనిచేయండి అన్నవారిని సన్నాసి అన్నంత మాత్రాన సన్నాసి అయిపోరు. కొత్త జిల్లాల మైకంలో ప్రజారోగ్యాన్ని విస్మరించడమే దారుణం.