తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. కేసీఆర్, చంద్రబాబు నాయుడులు దీనికోసం తగిన కసరత్తు చేశారు. తమ తమ వాదనను గట్టిగా వినిపించడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. తెలంగాణలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరాలను గట్టిగా వినిపించడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. లెక్కల్లోకి రాకుండా ఏపీ చాకచక్యంగా నీటిని దోచుకుంటోందనే వాదనను కూడా కేసీఆర్ గట్టిగానే వినిపించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే సమావేశంలో రెండు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను అభ్యంతరాలను వివరించడానికి తగిన సమయం కేటాయించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి తమ వాదన వివరించడానికి అవకాశం ఉంది. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులూ క్లుప్తంగా మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తారు. ఆ తర్వాత, ఉమాభారతి ఈ అంశంపై ఇద్దరితో చర్చిస్తారు. వారి అభ్యంతరాలు, మార్గాంతరాలపై మంతనాలు జరుపుతారు. వీలైనంత వరకు సామరస్యంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అయితే, తమ ప్రయోజనాల కోసం గట్టిగా వాణిని వినిపించడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని తెరాస వర్గాల సమాచారం.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరంలో అర్థం లేదని కేసీఆర్ గట్టిగా వాదించబోతున్నారు. డిండి, పాలమూరు-రంగారెడ్డి ఎప్పుడో ప్రతిపాదించిన పాత ప్రాజెక్టులని వివరిస్తారు. స్వయంగా తెలుగు దేశం పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రెండు ప్రాజెక్టులపై హామీనిచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరిస్తారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో జారీ అయిన జీవోల కాపీలను కూడా ఆయన ఉమాభారతికి చూపించబోతున్నారు. దీన్ని చంద్రబాబు ఎలా కౌంటర్ చేస్తారనేది ఆసక్తికరం. టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం ఏమి సమంజసం అని ఉమాభారతి సమక్షంలో కేసీఆర్ ప్రశ్నించ బోతున్నారు. అయితే పంతాలు పట్టింపులు కాకుండా పట్టువిడుపు ధోరణి అవలంబిస్తే సమస్యకు పరిష్కారం లభించవచ్చు.