తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో డ్రగ్స్ కేసులు హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి, రాజకీయాలకూ ఈ బడ్జెట్ సెషన్ అత్యంత కీలకం కానుంది, ఎందుకంటే మార్చి 20న ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల భారీ వ్యయంతో ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అంచనా. ప్రధానంగా మూసీ పునరుద్ధరణ, రైతు భరోసా , సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్క రోజు ముందే బ్లాస్ట్ అయిన డ్రగ్స్ కేసు
ఈ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే రాజకీయ వాతావరణం డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా వేడెక్కింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సిట్టింగ్ ఎంపీతో పాటు తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి , ఆయన సోదరుడు, ఇతర ప్రముఖులు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురు పాజిటివ్‌గా తేలడం, ఒక నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో గాలిలోకి కాల్పులు జరపడం వంటి అంశాలు ఈ కేసు తీవ్రతను పెంచాయి. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే మొదలైన యుద్ధం, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
డ్రగ్స్ ఎజెండాగా కేటీఆర్‌ను టార్గెట్ చేయనున్న కాంగ్రెస్
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న గ్యారెంటీలు, రైతులకు రుణమాఫీ అమలులో జాప్యం, శాంతిభద్రతల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తోంది. అదే సమయంలో, తాజా డ్రగ్స్ కేసును అస్త్రంగా చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని రచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ సంస్కృతి పెరిగిందని, ఇప్పుడు తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని నిరూపించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో సభలో దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.
నెలాఖరు వరకూ సమావేశాలు – కేసీఆర్ హాజరు లేనట్లే
సభ నిర్వహణకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో జరగనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం సమావేశాల గడువును ఖరారు చేయనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మార్చి 30 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఉగాది పండుగ మరుసటి రోజే బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఆర్థిక లోటు, కేంద్ర నిధుల సమీకరణ , రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి, అటు ఆర్థిక లెక్కలు, ఇటు డ్రగ్స్ సెగలతో ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రణరంగాన్ని తలపించేలా ఉన్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలు హాజరయ్యే అవకాశం లేదు. ఆయన వస్తారని కూడా ఎవరూ అనుకోకపోవడంతో అసలు ఆయన గురించి రాజకీయవర్గాలు ప్రస్తావించడం మానేశాయి.
