తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న చర్చ ఇప్పుడు పవర్ పాయింట్ పోరుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ తీరును ఎండగట్టిన వైనాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై పడింది. ఆ బాధ్యత హరీష్ రావు తీసుకున్నారు. ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్టీ ఆఫీసులో ఇస్తున్నారు. కేసీఆర్ బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు. వీటిల్లో రేవంత్ రెడ్డిపై తిట్ల దండకం ప్రయోగించి సమస్యను డైవర్ట్ చేయాలని చస్తే ప్రయోజనం ఉండదు. ప్రజలు రేవంత్ ప్రకటించిన అంశాలపై క్లారిటీ కోరుకుంటారు.
ఎదురుదాడి సరిపోదు.. హరీష్ చెప్పాల్సింది చాలా ఉంది!
తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను, ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో జరిగిన రాజీలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ఇప్పుడు ప్రతిపక్షం ప్రత్యారోపణలకే పరిమితమయి.. ఆ విషయాలన్నింటికీ సాక్ష్యాలతో సహా వివరణ ఇవ్వకపోతే ప్రజల్లోసందేహాలు వస్తాయి. సహజంగా బీఆర్ఎస్ నేతల వ్యూహం .. కొత్త ఆరోపణలతో ఎదురు దాడి చేయడం.. రేవంత్ రెడ్డిపై టీడీపీ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూంటారు. కానీ అది ఎలాగూ చేస్తారు. వాటితో పాటు రేవంత్ చేసిన ఆరోపణలకూ సమాధానం ఇవ్వాల్సి ఉంది.
ఏపీ ప్రాజెక్టుల కంటే సొంత తప్పులపై వివరణ ముఖ్యం
హరీష్ రావు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రారంభించని నల్లమల సాగర్, బనకచర్ల వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఇక్కడ సమస్య అది కాదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మళ్లింపు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై గతంలో జరిగిన ఒప్పందాల గురించి రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై హరీష్ రావు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పొరుగు రాష్ట్రంపై ఆరోపణలు చేయడం కంటే, గత పదేళ్లలో మన చేతుల్లో ఉన్న అవకాశాలను ఎందుకు జారవిడుచుకున్నారో చెప్పడమే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేయాల్సిన పని.
జల దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో వైఫల్యంపై మౌనం ఎందుకు?
దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ ఎలా చేస్తుందన్నది ముందు చెప్పాలి. కర్ణాటక, తెలంగాణల్లోని ప్రాజెక్టులన్నీ నిండి, ఎత్తి పోసుకోగలిగినంత ఎత్తిపోసుకున్న తర్వాత ఏపీకి వస్తాయి. ఏపీ కూడా ఎంత వీలయితే అంత నిల్వ చేసుకుంటుంది. మిగతా అంతా సముద్రం పాలవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క చుక్క కూడా నీరు ఆపుకోలేదు ఏపీ. ఎందుకంటే దిగువ రాష్ట్రం. అంతా ఆపుకున్నాకే దిగువ కు వస్తాయి. కేటాయింపుల విషయంలో బచావత్ ట్రైబ్యునల్ నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వరకు జరిగిన పరిణామాల్లో తెలంగాణ వాదన ఎందుకు బలంగా లేదు..బీఆర్ఎస్ పాలనలో ఎందుకు ఏపీకి నీళ్లిస్తామని అన్నారో కూడా చెప్పాల్సిన ఉంది.
రెచ్చగొట్టే రాజకీయాల కన్నా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం
రాజకీయాల్లో ప్రత్యారోపణలు సహజం, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇది ఆశించదగ్గ పరిణామం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదేళ్ల రికార్డులను తిరగేస్తూ వాస్తవాలను బయటపెడుతున్నప్పుడు, బిఆర్ఎస్ వాటిని సాంకేతికంగా, ఆధారాలతో తిప్పికొట్టలేకపోతోంది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు , నిర్మాణ లోపాలపై ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త వివాదాలను తెరపైకి తేవడం వల్ల ప్రజల్లో బిఆర్ఎస్ పట్ల విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉంది. పదేళ్ల కాలంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అంగీకరిస్తూనో లేదా సాక్ష్యాధారాలతో ఖండిస్తేనే ఈ చర్చకు ఒక తార్కిక ముగింపు లభిస్తుంది. బిఆర్ఎస్ కేవలం ఏపీ ప్రాజెక్టుల భూతాన్ని చూపిస్తూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సృష్టించిన స్పీడ్ కు అడ్డుకట్ట వేయడం హరీష్ రావుకు కష్టమే అవుతుందని అనుకోవచ్చు.
