తెలంగాణ మళ్లీ భగ్గుమంటోంది. జిల్లాల విభజన ప్రక్రియ అగ్గి రాజేసింది. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఇప్పుడున్న పది జిల్లాల సంఖ్యను ఏకంగా సుమారు మూడు రెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 27 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రజల అభిప్రాయల ప్రకారం మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కానీ అలా జరుగుతుందా అనేది అనుమానమే.
ఒక్క మంగళవారం నాడే అనేక జిల్లాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. బంద్ లు మొదలయ్యాయి. సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ 48 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. కరీంనగర్ లోనూ బంద్ నిర్వహించారు. ఉదయం బంద్ మొదలుకాగానే విధ్వంసకర ఘటన చోటు చేసుకుంది. బస్ స్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంకుపై దాడి జరిగింది. మొత్తానికి సిరిసిల్లలో సంపూర్ణ బంద్ జరిగింది. ఇది బుధవారం కొనసాగుతుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ రాజీనామా చేసి ఆందోళనలో పాల్గొనాలంటూ పలువురు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా కోసం కూడా జనం బంద్ బాట పట్టారు. జనగామలో హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ గర్జన సభ నిర్వహించారు జేఏసీ నాయకులు. దీనికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరు కావడంపై నిరసన వ్యక్తమైంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. జనగామ గర్జన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా యువత ఉత్సాహంగా పాల్గొనడం కనిపించింది.
కరీంనగర్ జిల్లాలోనే, కోరుట్లలోనూ 48 గంటల బంద్ మొదలైంది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న కోరుట్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలంటూ డివిజన్ సాధన సమితి పిలుపునిచ్చింది. కోరుట్లలో ఒకేసారి రెండు రోజుల బంద్ జరగడం అసాధారణం. పట్టణంలో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దుకాణాలన్నీ బంద్ అయ్యాయి. పూర్తి బంద్ జరిగింది.
శంషాబాద్ జిల్లా విషయంలోనూ ఆందోళనలుకొనసాగుతున్నాయి. ఆ జిల్లా పేరును చేవెళ్ల జిల్లాగా మార్చాలంటూ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. శంషాబాద్ జిల్లాలో తమ మండలాలను కలపాలంటూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దసరా నాటికి కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం డెడ్ లైన్ ప్రకటించింది. ఇక ఎన్ని ఆందోళనలు జరిగినా ఏమీ మార్పులు ఉండవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలా హడావుడిగా కాకుండా ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజలకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే చాలా వరకు ఆందోళనలు, విధ్వంసాలు తగ్గవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేయడానికే పట్టుదలతో ఉన్నట్టుంది.