బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇంకా నిజాలు చెప్పేందుకు సిద్ధంగా లేదు. ఏదో విధంగా సమస్యను సాగదీసుకునేందుకే సిద్ధపడుతోంది. అందులో భాగంగానే కేబినెట్ లో పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామని మిగతా ఎన్నికలను.. రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతనే నిర్వహిస్తామని ప్రకటించారు. ఇది కూడా పాత రిజర్వేషన్లతోనే. అంటే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధంగా అమలు చేయడంలేదు. పార్టీ పరంగా అమలు చేస్తారు. పంచాయతీ ఎన్నికలకే సాధ్యం కానప్పుడు.. పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు ఎలా సాధ్యమో తెలంగాణ మంత్రులు ఊహించడం లేదు. ఊహించినా బయటకు చెప్పేందుకు ధైర్యం చేయడం లేదు.
స్థానిక ఎన్నికలు రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
స్థానిక ఎన్నికలను రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటి రిజర్వేషన్ల రాజకీయం చేసి.. యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇలాంటి హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక కేవలం మహారాష్ట్రకే వర్తించదు. అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ఒకటే.
ఆర్థిక సంఘం నిధుల కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు
15వ ఆర్ధిక సంఘం కాల పరిమితి వచ్చే 2026 మార్చ్ 31 తో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీం కోర్టు సూచనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ల పరిమితి కి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. కానీ ఒక వేర్వేరు రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.
చట్టపరంగా సాధ్యం కాదు.. పార్టీ పరంగా ఇస్తామని ప్రజలు చెప్పొచ్చు కదా !
రాజకీయాల్లో ప్రజల్ని భ్రమలో ఉంచడం అనేది ఓ వ్యూహం. కానీ కొన్ని అంశాల్లో మాత్రం.. అలా ఉంటే.. మొదటికే మోసం వస్తుంది. రిజర్వేషన్లు వంటి విషయాల్లో ప్రజలకు నిజాలు చెప్పాల్సిందే. నిజాయితీగా ఉండాల్సిందే. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అది రాజ్యాంగ సవరణతో ముడిపడిన అంశం కాబట్టి.. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీ అని.. అది కాలేదు కాబట్టి.. సాధ్యం కావడం లేదని ప్రజలకు చెప్పవచ్చు. అందుకే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పి ఎన్నికలకు వెళ్లవచ్చు. బీసీలే తదుపరి నిర్ణయం తీసుకుంటారు.ఎందుకంటే ఇతర ఏ పార్టీలు కూడా రిజర్వేషన్లు తీసుకు రాలేవు. ఒక్క కాంగ్రెస్ కే ఆ అవకాశం ఉంది. బీజేపీ అధికారంలో ఉండి.. చేయడం లేదు కాబట్టి అసలు పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత ఫెయిర్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
