తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఊపు రాగానే… ముఖ్యమంత్రి అభ్యర్థులపై కూడా చర్చ ప్రారంభమయింది. దీంతో నేతలు వర్గాలుగా విడిపోవడం ప్రారంభించారు. సాధారణంగా బీజేపీలో.. ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న చర్చ జరగదు. కానీ.. తెలంగాణ బీజేపీలో మాత్రం అప్పుడే ప్రారంభించేసుకున్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని.. కాబోయే సీఎం కిషన్‌రెడ్డేనని ఎంపీ సోయం బాపూరావు ప్రకటించేశారు. బాపూరావు ప్రకటన బీజేపీలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. నిన్నామొన్నటిదాకా కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీలో పెద్ద నేతగానే ఉన్నారు.
కానీ.. ఇప్పుడు ఆయనకు పోటీగా మరికొందరు దూసుకొచ్చారు. కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన తర్వాత.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ .. పార్టీని దూకుడుగా నడపడంలో సక్సెస్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో సొంత అడ్డా అయినప్పటికీ కిషన్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు. బండి సంజయ్ మొత్తాన్ని లీడ్ చేశారు. దీంతో ఆయనకు ప్రధాని కూడా ఫోన్ చేసి అభినందించారు. పైగా.. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో కిషన్ రెడ్డికి టెన్షన్ ప్రారంభమయినట్లయింది. తెలంగాణ బీజేపీలో తాను తప్ప ఎవరూ లేరనుకుంటున్న సమయంలో.. బండి సంజయ్ దూకుడు ఆయనను కంగారు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ కారణంగానే ఆయన అనుచరులు ఇప్పటి నుండే కిషన్ రెడ్డి పేరును ప్రచారంలోకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. బీజేపీలో నేతలు ఎక్కువగా పార్టీ కోసం కలసికట్టుగా పని చేస్తారు. పార్టీ హైకమాండ్ ఎవర్ని సీఎంగా నియమిస్తే వారికే మద్దతిస్తారు. ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం అరుదు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం.. ఇంకా ఫుల్ ఫామ్ లోకి రాకముందే నేనంటే..నేనని అనుకునే పరిస్థితి వచ్చింది.