తెలంగాణ బీజేపీ నేతలు కొంతమంది తమ క్రెడిబులిటి కోల్పోతున్నారు. ఇష్టారీతిన మాట్లాడుతూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. సంచనాలకు కేంద్ర బిందువుగా నిలవాలని ఆరాటమో ఏమో కానీ తరుచుగా ఏదో అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వార్తల్లో హైలెట్ అవుతున్నారు కానీ, వారు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండకపోవడం, ఆ కామెంట్స్ సత్యదూరమై ఉండటంతో బీజేపీ నేతల వ్యాఖ్యలను అంతా లైట్ తీసుకుంటున్నారు.
తాజాగా బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ లో విలీనం ఉంటుందని తర్వాత కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారన్నారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మార్పు ఖాయమని చెప్పుకొచ్చారు. ఇందుకు ఆయన చెప్పిన లాజిక్..పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్న హరీష్ , కేసీఆర్ వెంట నడుస్తానని ప్రకటించడమేనట. ఇది సిల్లీ లాజిక్ అని ఎవరికైనా అనిపిస్తోంది.
ఒక్క ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రమే కాదు..గతంలో లక్ష్మణ్ కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఆగస్ట్ సంక్షోభం తప్పదని బిగ్ బాంబ్ పేల్చారు. ప్రభుత్వం కుప్పకూలుతుందని రేవంత్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీకి ఉండటంతో ఈ విషయంపై తీవ్ర ప్రకంపనలు రేగాయి. ఆ తర్వాత అలాంటిదెం లేకపోవడంతో అదంతా టైం పాస్ పాలిటిక్స్ లో భాగమని క్లారిటీ వచ్చింది.
అలాగే, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుందని, మంత్రులంతా కుంభకోణంలో బిజీగా ఉన్నారని గతేడాది ఆరోపించారు. ఒక్కొక్క మంత్రి బాగోతం త్వరలోనే బయటపెడుతానని చెప్పారు. కానీ, ఆయన ఏ మంత్రి స్కామ్ వివరాలను బయటపెట్టకపోవడంతో.. సంచలనాల కోసమే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతారని అందరికీ మరోసారి స్పష్టత వచ్చినట్లు అయింది.
ఇప్పుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కామెంట్స్ ను తెలంగాణ రాజకీయ పరిశీలకులు కూడా ఆ కోవలో చూస్తున్నారు.