ఈటల రాజేందర్‌కు బీజేపీలో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆయన మాటల్ని సొంత పార్టీ కూడా వ్యక్తిగతం అని చెప్పాల్సి వస్తోంది. స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని.. న్యాయపరమైన వివాదాలు చుట్టుముడతాయని అందుకే.. ఎన్నికలకూ ఎవరూ సిద్ధం కావొద్దని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తోసిపుచ్చారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమన్నారు. బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికలు జరగాలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావాలన్న లక్ష్యంతో ఉందన్నారు.
స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండేళ్లు జాప్యం చేశారని.. హైకోర్టు ఆదేశించినందునే తప్పనిసరై ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతం. కోర్టుకు కాంగ్రెస్ నేతలే వెళ్లినట్లున్నారు. రాజ్యాంగ బాధ్యతను కాంగ్రెస్ తీసుకోవాలి. ఎన్నికలు జరిపి తీరాలని కోరుతున్నా. దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలుంటాయి. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్రానికి సంబంధం లేదన్నారు.
ఇప్పటికే ఈటల రాజేందర్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల బీజేపీ అగ్రనేతలు వచ్చినప్పుడు కూడా ఆయన హాజరవుతున్నారో లేదో తెలియడం లేదు. కానీ ఇలా కార్యకర్తలతో మాట్లాడినప్పుడల్లా మాత్రం.. వివాదాస్పద అవుతున్నాయి. ఆయన మాటల వల్ల ఒక్కో సారి ఈటల పార్టీ మారుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దాన్ని ఆయన ఖండించుకోవాల్సి వస్తోంది.