తెలంగాణ కేబినెట్లో మళ్లీ మార్పు చేర్పులు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఓ మంత్రి పదవి దక్కించుకోవాలంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నీ కలసి రావాలి. ఇక కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరణ చేయాలంటే… ఓ పెద్ద యుద్ధమే జరగాలి. ప్రస్తుతం అలాంటి యుద్ధం కర్ణాటకలో జరుగుతోంది. కానీ తెలంగాణలో లేదు. రెండు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచి.. ఆశావహుల్ని కంట్రోల్ లో ఉంచుతున్నారు. ఇప్పుడు కొత్తగా పదవుల పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్‌కు కనిపించడం లేదు. కానీ చర్చలు, పుకార్లు మాత్రం ప్రారంభమయ్యాయి.
రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్లకు మంత్రి పదవి ఇస్తే ఏం సందేశం వెళ్తుంది ?
మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్నారని..కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నిజంగా అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఓ చిన్న పాటి యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పదవుల కోసం విరుచుకుపడే వాళ్లు ఎక్కువ అవుతారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు పార్టీ ఎమ్మెల్యేగా ఐదు సంవతర్సాల పాటు నిరంతర దాడులు చేయడమే కాదు.. ఎన్నికలకు ముందు లేవకుండా చేయడానికి మునుగోడు ఉప ఎన్నిక కూడా తెచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి ఉంది. గెలిచే పార్టీ అన్న క్లారిటీ వచ్చాకే ఆయన పార్టీలోకి వచ్చారు. గెలిచాక మంత్రి పదవి కోసం అదే లొల్లి చేస్తున్నారు. అలాంటి వారికి పదవులు ఇస్తే.. అలా రచ్చ చేయాలనుకున్నవారికి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లే. మరింత మంది రాజగోపాల్ రెడ్డిలు పుట్టుకు వచ్చేందుకు అవకాశం ఇచ్చినట్లే.
సద్దుమణిగిన పదవుల పంచాయతీ
కారణం ఏదైనా ఇప్పటికి పదవుల పంచాయతీ కాంగ్రెస్‌లో సద్దుమణిగింది. కాంగ్రెస్ లో నిజాయితీగా మంత్రి పదవులు దక్కాల్సిన ఇద్దరు నేతలు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలకు కేబినెట్ హోదాతో పదవులు ఇచ్చారు. వారికి అసంతృప్తి ఉన్నా.. ఏదో ఒకటి అని సంతృప్తి పడుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటే.. మళ్లీ అలాంటి వాళ్లు ఆశలు పెంచుకుంటారు. మంత్రుల వివాదాలు ఉన్నా.. కొంత మందిని తప్పించలేని పరిస్థితి ఉంది. వారిని తప్పిస్తే జరిగే రాజకీయం వేరుగా ఉంటుంది. అలాంటి రాజకీయం జరగకుండా.. రాష్ట్ర నాయకత్వాన్ని హైకమాండ్ బలపరచలేదు కాబట్టి.. ఆ మైనస్‌లను మోసుకుంటూనే వెళ్లాల్సి ఉంది.
మారిస్తే రేవంత్‌కు మంచిదే.. ధిక్కరించే వారికి చెక్
కేబినెట్ లో పూర్తి స్థాయి మార్పు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ కూ ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ లో కొంత మంది సీఎం తర్వాత మేమే అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. సీఎంనూ లెక్క చేయడంలేదు. నేరుగా హైకమాండ్ తో టచ్ లో ఉండి.. తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ సహా కొంత మందిపై వివాదాలు ఉన్నాయి. తన మాట పూర్తిగా వినే మంత్రులకు చాన్స్ ఇవ్వాలని.. వారితో కలిసి పని చేయాలని రేవంత్ అనుకుంటారు. రీషఫుల్ చేయాల్సి వస్తే.. సీఎం రేవంత్ ఇవే సమీకరణాలు తీసుకుంటారు. ఆయనకు ప్లస్సే అవుతుంది.కానీ తర్వాత రేగే అలజడిని తగ్గించడానికి రేవంత్‌కు హైకమాండ్ పవర్ ఇవ్వదు. అదే పెద్ద సమస్య.