తెలంగాణ కేబినెట్లో మంత్రులు అంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా వారికి తెలుసో లేదో కానీ.. వివాదాల్లో మాత్రం ముందు ఉంటున్నారు. ఇలాంటి వాటి విషయంలో కఠినంగా ఉండాల్సిన సీఎం రేవంత్ అసలు పట్టించుకోవడం లేదు. అలాంటి అధికారం ఆయనకు హైకమాండ్ ఇవ్వలేదు. ఏమైనా ఉంటే శ్రీధర్ బాబుకు చెప్పుకోండి అన్నట్లుగా ఆయన ఉంటున్నారు. దీంతో మంత్రివర్గంలో మంత్రులు ఏం చేస్తున్నారో.. వారికే అర్థం కావడం లేదు.
పొన్నం, వివేక్, అడ్లూరి మధ్య ఆధిపత్య పోరాటం
పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి . ఆయన నోటి దురుసు కారణంగా అసలు వివాదం ప్రారంభమయింది. తన తోటి మంత్రి అని చూడకుండా ప్రెస్మీట్లో అడ్లూరి లక్ష్మణ్‌ను దున్నపోతు అని సంబోధించారు. వివేక్ కూడా.. తాను అందరి కంటే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో అడ్లూరి సహనం కోల్పోయి బయట పడ్డారు. దీంతో పెద్ద వివాదం అయిపోయింది. సీఎం పట్టించుకోలేదు కానీ.. పీసీసీ చీఫ్ మాత్రం మాట్లాడి సర్దుబాటు చేశానని చెప్పారు. ఇలాంటివి మాటలతో ముగిసిపోయే రాజకీయాలు కాదు.
పొంగులేటి, కోమటిరెడ్డి ఏం చేస్తున్నారు ?
మరో వైపు పొంగులేటి, కోమటిరెడ్డి వారి రాజకీయాలు వారు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పొంగులేటి వ్యవహారంపై గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన పెద్దగా ముఖ్యమంత్రి పక్కన కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించడానికి రేవంత్ వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు వెళ్లలేదు. ప్రత్యేకంగా వెళ్లి కలసి వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దూకుడు తగ్గించుకున్నారు. లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో .. వాళ్ల రాజకీయం ఏమిటో సచివాలయంలో గుసగసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
రేవంత్ చేతులు కట్టేసిన హైకమాండ్
సాధారణంగా మంత్రివర్గంపై ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి. కానీ అలాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఇవ్వలేదు. ఆయన మాటలను వినాల్సిన పని లేదన్న వాతావరణాన్ని కల్పించింది. నేరుగా పనుల్లో జోక్యం చేసుకోవడంతో పాటు రేవంత్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చింది. దీని వల్ల మంత్రులకు నేరుగా ఆదేశాలివ్వలేని పరిస్థితికి రేవంత్ వెళ్లారు. ఏమైనా అంటే.. నువ్ చెప్పేదేంది అన్నట్లుగా కొంత మంది మంత్రులు వ్యవహరించే పరిస్థితులు కనిపించడంతో రేవంత్ కూడా లైట్ తీసుకున్నారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ పరిణామాలన్నింటికీ కాంగ్రెస్ హైకమాండ్ వింత ధోరణే కారణం. మంత్రుల పంచాయతీలు ముగిసే అవకాశం కనిపించడం లేదు.