అధికారులు బహిరంగ కార్యక్రమాల్లో అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అచ్చంపేటలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి శరత్ కాళ్లు మొక్కుతున్నారని చూసుకోలేదు. వెళ్లిపోయే హడావుడిలో ఉన్నారు. కానీ వీడియోలు వైరల్ అయ్యాయి.
గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ .. కలెక్టర్ల కార్యాలయాలను ప్రారంభించడానికి వెళ్లినప్పుడల్లా అక్కడి అధికారులు కేసీఆర్ కాళ్లకు మొక్కేవారు. ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో గౌరవాన్ని కోల్పోతున్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చేవి. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు విమర్శించారు. ఇప్పుడు ఐఏఎస్ అలాగే చేశాడని ప్రచారం జరగడంతో అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ సమావేశాల్లో కానీ.. ప్రజా సమావేశాల్లో కానీ అధికారులు ఎవరూ అనుచితంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరారు. ఏఐఎస్ రూల్స్ కు అనుగుమంగా మసలుకోవాలన్నారు. అధికారుల ప్రవర్తన ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉండాలి కానీ.. తగ్గేలా ..నవ్వుల పాలయ్యేలా ఉండకూడదని సీఎస్ స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కు ఐఏఎస్లు కాళ్లు మొక్కినప్పుడు అలా చేయవద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పలేదు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం మరోసారి అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.