కేసీఆర్ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన కొన్ని నియామకాలపై గతంలో కోర్టు మొట్టికాయలు వేసి సందర్భాలు కొన్ని ఉన్నాయి! అలాంటి మరో బలమైన అంశమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దొరికిందని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీకి అధికార తెరాస మీద పైచేయి సాధించిన సందర్భాలు ఇంతవరకూ పెద్దగా లేనే లేవు. ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచీ తెరాసదే అప్పర్ హ్యాండ్‌గా నిలుస్తూ వస్తోంది. అయితే, ఇన్నాళ్లకు మరోసారి తెరాసను ఇరుకున పెట్టేందుకు కావాల్సిన ఒక బలమైన అంశాన్ని రేవంత్ రెడ్డి చర్చకు లేవనెత్తారు! కేసీఆర్ సర్కారు ఇష్టానుసారం పంచిన ‘క్యాబినెట్ హోదా’లపై గవర్నర్ నరసింహన్‌కు రేవంత్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా క్యాబినెట్ హోదా పంపకాలు జరిగాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు.
తెలంగాణ క్యాబినెట్లో మంత్రులతోపాటు పలువురు ఇతర నేతలు కూడా క్యాబినెట్ హోదాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే అంశమై రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు! లెక్క ప్రకారం పద్దెనిమిది మంది మంత్రులు మాత్రమే క్యాబినెట్ ర్యాంకింగ్ ఉండాలనీ, కానీ కేసీఆర్ సర్కారు వారు మరో 18 మందికి క్యాబినెట్ హోదాలు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అదనంగా ఇంతమందికి క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వడం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నిస్తున్నారు. క్యాబినెట్ హోదాలను ఇలా ఇష్టం వచ్చినట్టు పంపిణీ చేయడం చెల్లదంటూ ఆయన వాదిస్తున్నారు! వారి హోదాలు చెల్లవని చెబుతున్నారు.
నిజానికి, కొన్నాళ్ల కిందట పార్లమెంటరీ సెక్రటరీల నియామకాల విషయంలో తెరాస సర్కారుకు చుక్కెదురైంది. కొంతమందిని సెక్రటరీలుగా కేసీఆర్ నియమిస్తే.. ఆ నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భమూ ఉంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తూ… కేవలం సలహాదారుల పేరుతో 18 మందికి క్యాబినెట్ ర్యాంకు ఇవ్వడం చెల్లదని అంటున్నారు. ఇది కేసీఆర్ సర్కారును కాస్త ఇబ్బందులకు గురిచేసే అంశమే అవుతుందని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రేవంత్ లేవనెత్తిన ఈ ఆరోపణలపై కేసీఆర్ సర్కారు నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఏదైమైనా, రేవంత్ వేసిన ప్రశ్న తెరాసను కాస్త ఉక్కిరిబిక్కిరికి గురి చేసే అంశమే అనడంలో సందేహం లేదు.