త్రిబాణధారి బర్బరీకుడు అనే సినిమా ఇటీవల వచ్చింది. తమిళ డబ్బింగ్ సినిమా అయినా ఉదయభాను సహా చాలా మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఓ మాదిరిగా ఆడిన సినిమా బర్బరీకుడు ఎవరో కొత్తగా పరిచయం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా .. తాను బర్బరీకుడి తరహా అని ప్రకటించుకున్నారు.
శిల్పా కళా వేదికలో జరిగిన మాదిగ ఉద్యోగుల సమ్మేళనంలో రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, అణగారిన వర్గాల పక్షాన నిలబడటమే తన నైజమని స్పష్టం చేశారు. బలహీనుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే బార్బరీకుడి లక్షణమే తనను మాదిగ జాతి హక్కుల కోసం, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. మహాభారత యుద్ధంలో బార్బరీకుడు ఏ పక్షం బలహీనంగా ఉంటే ఆ పక్షాన నిలబడి పోరాడాలని నిశ్చయించుకున్నట్లే, తాను కూడా సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు అండగా నిలిచానని రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన మరో పాత్ర కర్ణుడిని ప్రస్తావిస్తూ.. కర్ణుడు తన మిత్రుడి కోసం ప్రాణాలకు తెగించి మిత్రధర్మాన్ని ఎలా పాటించాడో, తాను కూడా మాదిగ సోదరులకు ఇచ్చిన మాట కోసం అదే విధమైన మిత్రధర్మం పాటించి వర్గీకరణను అమలు చేశానని ఉద్ఘాటించారు. సమస్యలను పరిష్కరించేటప్పుడు వెనుక నుంచి దాడులు జరగడం సహజం, కానీ బార్బరీకుడిలా నేను ధైర్యంగా నిలబడతాను అని ఆయన వ్యాఖ్యానించారు.
బర్బరీకుడు ఎవరంటే?
మహాభారతంలో బర్బరీకుడు భీముని మనవడు , ఘటోత్కచుని కుమారుడు. ఇతను గొప్ప వీరుడు. అపారమైన శక్తులు కలవాడు. బర్బరీకుడి వద్ద ఉన్న మూడు ప్రత్యేకమైన బాణాలు మొత్తం యుద్ధాన్ని కొద్ది నిమిషాల్లోనే ముగించగలవు. అయితే, తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం.. యుద్ధంలో ఎవరు బలహీనంగా ఉంటే వారి పక్షాన నిలబడి పోరాడతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అతని శక్తి వల్ల పాండవులకు ముప్పు వాటిల్లుతుందని భావించిన కృష్ణుడు, బ్రాహ్మణుడి రూపంలో వచ్చి బార్బరీకుడి తలను దానంగా అడుగుతాడు.