తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించి.. గ్రామాల్లో పెండింగ్ పథకాలు ఏమైనా ఉంటే ఇచ్చేసి.. వెంటనే ఎన్నికలు పెట్టబోతున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు డిసెంబర్ 9న ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు రోజులకే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ రానుంది. ఐదు రోజుల గ్యాప్ తో మరో రెండు విడుతలు పెట్టి పంచాయతీలకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ వస్తుంది.
పల్లెలపై కాంగ్రెస్ జెండా
తెలంగాణలో 90 శాతం పల్లెలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ నేతలకు కూడా అదే చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రేవంత్ చెప్పినా చెప్పకపోయినా ఎమ్మెల్యేలు తమ పట్టు నిరూపించుకోవాలంటే గ్రామాలపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే కొద్ది రోజులుగా వారు పంచాయతీ ఎన్నికలపై స్థానిక స్థాయిలో పని చేస్తున్నారు. పార్టీ ఆశావహుల్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది. అలాంటి చోట్ల ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
ఏకగ్రీవాలకు ఎక్కువ చాన్స్
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో ఎక్కువ చాన్స్ ఉంటుంది. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. ఇస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే.. ఏకగ్రీవ పంచాయతీలకు అర్థిక సాయం అనే కాన్సెప్ట్ తో తమ పార్టీ ఖాతాలో వేసుకోవడం అధికారంలో ఉన్న అందరూ చేసే పని. కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఉంటుందని అనుకోలేం. చిన్న పంచాయతీల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి వేలం నుంచి బెదిరింపుల వరకూ చాలా మార్గాలున్నాయి. అందుకే.. ఈ సారి రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉంది.
ఎన్నికలు ఎలా నిర్వహించాలో గతంలో చూపించిన కేసీఆర్
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు రెండు సార్లు జరిగాయి. ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఆయన చూపించారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు దక్కిందేమీ లేదు. అన్ని చోట్లా పోలింగ్ జరిగినా బీఆర్ఎస్ హవానే కనిపించింది. గ్రామ స్థాయి రాజకీయాలు వేరుగా ఉంటాయి. అలాంటి రాజకీయాల్ని రేవంత్ ఇంకా బాగా గుర్తించి అనువైన ఫలితాలను సాధించగలరు. అందుకే .. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలపై కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతాయని అనుకోవచ్చు.