తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం చిట్ చాట్ రాజకీయాలు పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం , పార్టీ మధ్య సమన్వయం ఉండాలని భావిస్తున్నా, సీనియర్ నేతల నోటిదురుసు వల్ల అది కాస్తా చిక్కుల చాట్ గా మారుతోంది. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో సరదాగా మాట్లాడే మాటలు, మరుసటి రోజు పత్రికల్లో హెడ్ లైన్లుగా మారి పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తున్నాయి.
నేతల ధిక్కార స్వరం – గందరగోళం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి చేసిన వ్యాఖ్యలు మరువక ముందే, స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాను మంత్రిని కావాలని ఆకాంక్షించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, మంత్రి శ్రీధర్ బాబు సీఎం అభ్యర్థిని ఏఐసీసీ నిర్ణయిస్తుంది అని అనడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఖాయమని బహిరంగంగా చెప్పుకోవడం వంటివి కేడర్లో తీవ్ర అయోమయాన్ని నింపుతున్నాయి. ఎవరు ఎవరికి లోబడి పని చేస్తున్నారు? పార్టీలో క్రమశిక్షణ ఉందా లేదా? అనే ప్రశ్నలు విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి.
హైకమాండ్ ఆదేశాలు – అమలులో వైఫల్యం
ఈ చిట్ చాట్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మీడియా ప్రతినిధులతో అనధికారిక చర్చలు జరపవద్దని, విధానపరమైన నిర్ణయాలపై నోరు జారవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ మార్కు రాజకీయాల్లో ఒకరిని మించి మరొకరు తామే హైకమాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ ఆదేశాలను వినేవారే కరువయ్యారు. సీనియర్ నేతలు తమ వ్యక్తిగత ఎజెండాలను చిట్ చాట్ల రూపంలో బయట పెడుతుండటంతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా పక్కదారి పడుతున్నాయి.
అంతర్గత ప్రజాస్వామ్యమా? క్రమశిక్షణా రాహిత్యమా?
ఈ పరిణామాలను కొందరు కాంగ్రెస్ వాదులు అంతర్గత ప్రజాస్వామ్యం అని సమర్థించుకుంటున్నప్పటికీ, ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి గందరగోళ వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తాయి. నేతల మధ్య ఉన్న ఈ వైరుధ్యాలు గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. కాంగ్రెస్ తన సొంత చిక్కుల నుండి బయటపడి, సమన్వయంతో ముందుకు వెళ్లకపోతే ఈ చిట్ చాట్లు పార్టీ పునాదులనే కదిలించే ప్రమాదం ఉందన్న ఆందోళన క్యాడర్లో కనిపిస్తోంది.


