పైసలు తీయని టికాంగ్రెస్‌ నేతలపై కుతకుత

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించే అవకావం వుందని ఒక ప్రచారం జరుగుతూనే వుంది. అయితే ముందు కాంగ్రెస్‌లో విశ్వాసం కలిగించే వారెవరన్నది ప్రశ్న. రాజకీయాలు ఎన్నికలు ధనమయమై పోయిన కాలం గనక విశ్వాసం కలిగించడమంటే సొమ్ములు కురిపించాల్సిందేనంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. పదేళ్ల పాలనా కాలంలో దండిగా వెనకేసుకుని ఇప్పుడు ముందుండి నడిపిస్తున్న అగ్ర నాయకుల దగ్గర డబ్బుకు లోటు లేదు గాని ఎవరూ తీయకపోతే ఎలాగని వారి ఆగ్రహం. కనీసం ముగ్గురు నలుగురు ముఖ్య నేతల దగ్గర కావలసినంత డబ్బు తీసుకురాగల పరపతి వున్నాయి. అయితే రేపు గెలిచినా నేనే సిఎం అవుతానని ఎ వరు చెప్పగలరు? అలాటప్పుడు ఏం చూసుకుని వున్నది వదిలించుకోవడం అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు సదరు నేతలు. నా పేరు ప్రకటించండి అంతా చూసుకుంటానని ఒక నాయకుడు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారట. కాని కాంగ్రెస్‌ అధిష్టానం అందుకు సిద్ధంగా లేదు. ఒక పేరు చెప్పి మిగిలిన వారిని దూరం చేసుకోవడమెందుకని వారి వ్యూహం. ఈ మల్లగుల్లాల్లో టి కాంగ్రెస్‌ వ్యవహారం మాటలలో వున్నంత జోరు చేతల్లో కనిపించడం లేదు. ఈ మధ్య రాహుల్‌ గాంధీ పర్యటన సమయంలో కూడా పెట్టుబడి పెట్టిందెవరంటే స్థానికంగా ఎవరికి వారే భరించారు తప్ప భారీగా ఆదుకున్న వారెవరూ లేరని అంటున్నారు. అయితే జగ్గారెడ్డి పెట్టుకున్నాడని వేదికపై విహెచ్‌ చెప్పడం, రాహుల్‌ బలపర్చడం చూశాం. దామోదర రాజ నరసింహ పేరు మరికొంతమంది చెబుతున్నారు. కాంగ్రెస్‌ సంసృతి ప్రకారం ఆ పేరంటేనే చిందులు తొక్కుతున్నారు మరికొందరు. కాబట్టి టి కాంగ్రెస్‌ నేతలు ముందు తమలో తాము తేల్చుకుంటే తప్ప యుద్ధంలో దిగలేరు. అయితే మాకిది మామూలే. ఎప్పుడైనా ఎన్నికల తర్వాత సిఎంను నిర్ణయించుకుని అయిదేళ్లు చక్కగా ఏలుకుంటామంటారు కాంగ్రెస్‌ వాదులు. కొత్త రాష్ట్రంలో ఆ పాత కథ పునరావృతమవుతుందా? చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.