తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం మరోసారి ప్రయత్నం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని నిర్ణయిస్తూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్చి లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే తీర్మానాలను ప్రభుత్వం ఆమోదించింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ ప్రాతినిధ్యం కల్పించాలని రెండు తీర్మానాలను అసెంబ్లీలో ఆమోదించింది. కులగణన ఆధారంగా ఈ తీర్మానాలు చేశారు. కేంద్రానికి పంపించారు. అవి కేంద్రం వద్ద పెడింగ్ లో ఉన్నాయి.
రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణే మార్గం
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటుపై సందేహాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. ఇప్పటికే ఆ పరిమితికి వచ్చేసింది. ఎవరికి రిజర్వేషన్లు పెంచాలన్నా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించుకోవాల్సి ఉంటుంది. దేశమంతా రిజర్వేషన్ల పోరాటాలు నడుస్తున్న సమయంలో ఏ ఒక్కరికీ ఇలాంటి అవకాశం ఇచ్చినా మరిన్ని ఉద్యమాలకు ప్రేరణ అవుతుందని కేంద్రం తొక్కి పెట్టేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను ఓ అస్త్రంగా చేసుకుంది.
ప్రస్తుతం బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు
బీసీ డిక్లరేషన్ లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని గట్టిగా చెప్పింది. ఇప్పుడు చట్ట పరంగా సాధ్యం కాదని అప్పుడు ఎందుకు హామీ ఇచ్చారన్న ప్రశ్నలు వస్తాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి గురవుతోంది. మరో వైపు స్థానిక ఎన్నికలను నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కోర్టు కూడా మూడునెలల గడువు ఇచ్చింది. నెలలో రిజర్వేషన్లు ఖరారు చేయమని ఆదేశించింది. రిజర్వేషన్లు ఖరారు చేయమని చెప్పింది.. ఎంత శాతం అని కాదు.. ఏయే స్థానాలు ఎవరెవరికి అన్నది మాత్రమే. ప్రభుత్వం ఇప్పటి వరకూ 23 శాతం వరకే రిజర్వేషన్లు ఉండేవి. గతంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. కానీ సుప్రీంకోర్టుకు ప్రత్యేక హామీ ఇచ్చి అమలు చేశారు. తర్వాత ఆ అవకాశం లేకుండా పోయింది.
స్థానిక ఎన్నికలు కోర్టు వివాదాల్లో చిక్కుకుంటాయా?
బీఆర్ఎస్ హయాంలో 23 శాతం బీసీ రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడతామని చెబుతోంది. అది జరగాలంటే కేంద్రం అనుమతి ఉండాలి. అలా కాకుండా రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నిస్తే… న్యాయవివాదాలు ప్రారంభమవుతాయి. స్థానిక ఎన్నికలు కోర్టుల్లో చిక్కుకుంటాయి.