రాజకీయాల్లో ఏదైనా సంఘటనకు లేదా కామెంట్లకు రియాక్షన్ ఆలస్యం అయితే దానికి కాలం తీరిపోతుంది. కానీ ఆలస్యంగా రియాక్ట్ అవడానికి మాత్రం ఖచ్చితంగా ఓ పొలిటికల్ వ్యూహం ఉంటుంది. ఎప్పుడో వారం కిందట.. పవన్ కల్యాణ్ కోనసీమ టూర్లో దిష్టి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నేతలెవరికీ చురుకుదనం పుట్టలేదు. కానీ ఇప్పుడు ఎవరో గిల్లినట్లుగా ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చి.. పవన్ కల్యాణ్ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
ఎవరో ఆదేశించినట్లుగా ఒక్క సారిగా పవన్ పై దాడి
సహజంగా వచ్చే రియాక్షన్ అయితే పవన్ కల్యాణ్ ఆ మాటలు అన్న వెంటనే వచ్చేస్తుంది. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అవంత సీనియస్ గా తీసుకుని రాజకీయం చేయాల్సిన మాటలు కాదని అనుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి స్పందించారు. వారం తర్వాత సినిమాటో గ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది స్పందించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా ఖండించారు. అద్దంకి దయాకర్, బీర్ల ఐలయ్య లాంటి వారూ స్పందించారు. అందరూ సేమ్ టెంప్లెట్ చదివి వినిపించారు. పవన్ క్షమాపణకు డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు లైట్ తీసుకున్న మాటల్ని ఎందుకు హైలెట్ చేస్తున్నారు?
వీళ్లందరికీ ఒక్క సారిగా ఎవరో కీ ఇచ్చినట్లుగా.. వచ్చి స్పందిస్తున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అంటున్నారంటే.. నిజంగానే కీ ఇచ్చారని అనుకోవాలి. ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారన్నది మాత్రం బయటకు రాలేదు. తెలంగాణను పొరుగురాష్ట్ర డిప్యూటీ సీఎం కించ పరిచారని అయినా స్పందించకపోవడం ఏమిటని.. ఎవరైనా పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసి ఉండవచ్చునని అందుకే అందరూ స్పందించారని భావిస్తున్నారు.నిజానికి ఈ మాటల్ని తెలంగాణ ప్రజలే సీరియస్ గా తీసుకోలేదు. అయినా ఎందుకు వివాదం చేయాలనుకున్నారో ఆ పెద్దలకే తెలియాలి.
కాంగ్రెస్ రాజకీయమా కాంగ్రెస్ లోని కోవర్టుల రాజకీయమా ?
ఉద్యమం సమయంలో.. ఉద్యమం పేరుతో ఆంద్రా మీద బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన మాటలు మాటలు కూడా బూతులు. పవన్ కల్యాణ్ ఓ ఉదాహరణగా మాత్రమే దిష్టిగా చెప్పారు. ఈ మాటలకే పవన్ క్షమాపణ చెప్పాలనుకుంటే..తెలంగాణ రాజకీయ నేతలంతాఏపీకి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. మరుగునపడిపోయిన అంశాన్ని పైకి తెచ్చి విమర్శులు చేస్తున్నారంటే దీని వెనుక రాజకీయ కోణం ఉందని అర్థం చేసుకోవచ్చు. అది ఎవరి రాజకీయం.. కాంగ్రెస్ రాజకీయమా.. లేక కాంగ్రెస్లో కోవర్టుల రాజకీయమా అన్నది ముందు ముందు తెలుస్తుంది.