ఏరి తల్లీ నిరుడు మెరిసిన తెలంగాణ నేతలు

వారంతా కాంగ్రెస్ పార్టీని తమ భుజాల మీద మోసుకు తిరిగిన వారు.
వారంతా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలూ పని చేశారు.
వారంతా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా పని చేసిన వారు.

కాని ఇప్పుడు వారిలో కొందరు వయోభారంతో కొందరు, పార్టీ నిర్లక్ష్యంతో మరి కొందరు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. వారి అనుభవాలను వాడుకుని నానాటికి దిగజారుతున్న పార్టీని పటిష్ట పరచాలన్న ఆలోచన కూడా తెలంగాణ స్ధానిక నాయకులకు లేకపోవడంతో దశాబ్దాల రాజకీయ అనుభవం ఇంటికే పరిమితం అవుతోంది.

నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి 2014 ఎన్నికల వరకు చాల ఉత్సాహంగా పనిచేసారు. 2019 ఎన్నికలలో ఆయన కుమారుడిని ఎన్నికల బరిలో నిలిపారు. ఆయన ఓటమి పాలు కావడంతో రాజకీయాలకు దూరమయ్యారు. జిల్లలో రాజకీయాలను శాసించగల అతి తక్కువ మంది నాయకులలో జానారెడ్డి ఒకరు.

అయనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను ఉపయోగించడం లేదు. ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటికే పరిమితం చేసింది. ఇక వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి మరీ దారుణం. నీటిపారుదల రంగంపై విశేష అనుభవం ఉన్న పొన్నాల లక్షయ్యను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి పక్కన పెట్టేసారు. ఒకటి రెండు సార్లు తెలంగాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై పొన్నాల లక్ష్మయ్య విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆ తర్వాత ఆయన జాడే లేకుండా పోయింది. ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య పరిస్థితి కూడా ఇదే. రాజయ్యకు తన కోడలితో వచ్చిన వివాదంతో రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది. తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఖమ్మం జిల్లాకు చెందిన నాయకురాలు రేణుకా చౌదరి గత రెండు సంవత్సరాలుగా ఎక్కడా కనిపించటం లేదు… వినిపించటం లేదు. ఆమె రాజకీయ అనుభవాన్ని, చాణక్యాన్ని ఉపయోగించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచనే చేయడం లేదు. ఇక రాజధాని నగరానికి చెందిన సీనియర్ నాయకుడు కోదండ రెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా పార్టీ నాయకులకు తెలియదు. క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ గా పనిచేసిన కోదండరెడ్డికి నగర రాజకీయాలలో విశేష అనుభవం ఉంది. అయినా ఆయనను కాంగ్రెస్ పార్టీలో పట్టించుకున్న వారే కానరావడం లేదు.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్ ఎం. సత్యానారాయణ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, గెడ్డం అరవింద రెడ్డి వంటి నాయకులు వయో భారంతో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. రాజకీయాలలో వీరంతా ఆరితేరిన వారు.

తెలంగాణ ముఖ్యమంత్రిని ఢీ కొట్టడంలో వీరి శక్తియుక్తులు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడతాయి. అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాని, అధిష్టానం గాని ఈ సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com