తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వేదంతో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడిపోయిన తరువాత కకావికలు అయిపోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు జీర్ణం కావడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంతో పాటు అధిష్టానం తీరుతో కూడా వారు కలత చెందుతున్నారు. నెలలు గడిచిపోతున్నా పీసీసీ అధ్యక్షుడిగా ఎవరినీ ఎంపిక చేయకపోవడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన తమకు దిశా నిర్దేశం చేసే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నిక కావడం, పీసీసీ అధ్యక్ష పదవికి వేరొకరిని నియమించండి అని ప్రకటించడం జరిగి చాలా కాలమైంది. అయినా అదిష్టానంలో మాత్రం అధ్యక్ష పదవికి ఎంపికపై ఎలాంటి చలనం కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అని కొన్నాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కె పీసీసీ అధ్యక్ష పదవి అంటూ మరికొన్నాళ్ళు, జగ్గారెడ్డి ని ఖాయం చేశారంటూ కొత్త వార్తలు వస్తుండడంతో కార్యకర్తలు అసహనం పాలవుతున్నారు. గడచిన ఆరు సంవత్సరాలుగా తెలంగాణలో రోజురోజుకు కుంచించుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలంటే పీసీసీ అధ్యక్ష పదవి నియామకం వెంటనే జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరో ఒకరిని నియమిస్తే పార్టీలో నూతన ఉత్సాహం వస్తుందని, ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి వచ్చుననేది కార్యకర్తల అభిప్రాయంగా చెబుతున్నారు. మరి కొంత ఆలస్యం జరిగితే ఉన్న కాసింత కేడరు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.