తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శల దాడి పెంచింది. రాజకీయ ఆందోళనలతో దూకుడు పెంచింది. మల్లన్నసాగర్ విషయంలో ప్రతిపక్షాల వాదన నిజమే అనే తరహాలో కొన్ని పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవో వివాదాస్పదమైంది. అది సమగ్రంగా లేదని హై కోర్టు కొట్టేయడంతో ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.
యూనివర్సీటీల వైస్ చాన్న్ లర్ల నియామకాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. కేసు విచారణలో ఉండగా నియామకాలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల వరసగా ఎదురు దెబ్బలు తగడడంతో తెరాస ప్రభుత్వం డీలా పడింది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దాడిని తీవ్రం చేసింది.
ఆదిలాబాద్ లో మంగళవారం నిర్వహించిన రైతు గర్జన సభ, తెరాస ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించే వేదికగా మారింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేల్చారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్ మార్చుతున్నారంటూ పాత ఆరోపణను పునరుద్ఘాటించారు. రైతు రుణ మాపీ పైనా విమర్శలుగుప్పించారు. మూడో విడత రుణమాఫీ ఇంకా అమలు కాలేదని, దీనివల్ల రైతులకు రుణాలు రావడం లేదని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
మల్లు భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకు వేశారు. రైతులను ప్రభుత్వం మూడు రకాలుగా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రభుత్వానికిరైతులు ప్రజలుబుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.
ఎమ్మెల్యేలు, నాయకుల ఫిరాయంపులను ప్రోత్సహించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేశామని తెరాస నేతలు భావించారు. కానీ కాంగ్రెస్ ఇంకా పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉంది. ఎందుకో బీజేపీ మాత్రం ఇంత తీవ్రమైన విమర్శల దాడి చేయడం లేదు.