స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ బృందంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన ఈ ప్రతిష్టాత్మక విందులో పాల్గొనడం సదస్సులో సందడి పెంచింది. రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి ఉండటం తెలంగాణ టీం పట్ల గ్లోబల్ డెలిగేట్స్‌లో ఆసక్తిని కలిగించింది.
దావోస్‌లో జాయిన్ ది రైజ్ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త ప్రతిపాదనను ప్రపంచ వేదికపై ఉంచారు. పెట్టుబడుల నిర్ణయాలకు ఏటా ఒక సంవత్సరం సమయం వేచి చూడటం సరికాదని, ప్రతి జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు’ నిర్వహించాలని ఆయన కోరారు. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ బిజినెస్ లీడర్లు , పాలసీ నిర్ణేతల నుండి అనూహ్య మద్దతు లభించింది.
తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ రైజింగ్ 2047′ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తూ, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిలో భాగంగా భవిష్యత్ అవసరాల కోసం 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు, అందులో 50 శాతం గ్రీన్ కవర్ ఉంటుందని తెలిపారు. ఇదే వేదికపై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ , నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ లను ఆవిష్కరించారు. మూసీ పునరుజ్జీవనం ద్వారా నైట్ టైమ్ ఎకానమీని ప్రోత్సహిస్తూ, హైదరాబాద్‌ను దేశంలోనే తొలి 24 గంటల నగరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు.
