తెలంగాణ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల జీవో ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయింది. రాష్ట్ర ఎన్నికల అధికారి .. మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడుతల్లో పరిషత్ ఎన్నికలు, మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామని ఎస్ఈసీ తెలిపింది. 565 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు.. అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నవంబర్ 4న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో… రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. అయితే అసలు రిజర్వేషన్లు చెల్లుబాటుపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంది. ప్రస్తుతం జీవోపై పిటిషన్ హైకోర్టులో ఉంది. అక్టోబర్ ఎనిమిదో తేదీన విచారణ జరగనుంది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఉండకూడదంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయవద్దని హైకోర్టు సూచించింది. అయినా ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేశారు.