“ఎవరూ సమ్మెకు దిగవద్దని , అందర్నీ కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత తనది ” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా.. ఉద్యోగులు సమ్మెకు దిగడం వెనక రీజన్ ఏంటి? గత ప్రభుత్వ పాపాలను కడిగేందుకే ఈ ఏడాదిన్నర సమయం పట్టిందని, ఇప్పుడే వ్యవస్థలు సెట్ అవుతున్నాయని, ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్ చేసిన సూచనను ఉద్యోగసంఘాలు బుట్టదాఖలు చేయడం వెనక రాజకీయ ఎజెండా ఉందా?
ఎవరూ ఔనన్నా కాదన్నా సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ వర్గాల్లో సరైన పట్టు చిక్కలేదు. గత ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను తమ గ్రిప్ లో ఉంచుకుంది. ఉద్యోగ సంఘాల నేతలకు పదవులు ఇచ్చింది. వారు అడిగిన పనులను క్షణాల్లో చేసి పెట్టింది. రేవంత్ సీఎం అయ్యాక ఉద్యోగ సంఘాల నేతలను తల మీద పెట్టుకొని మోయడం లేదు. ప్రభుత్వానికి సహకరించండి తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. పైగా వివిధ పనుల కోసం ఉద్యోగ సంఘాల నేతలు లాబీయింగ్ చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఇది ఉద్యోగ సంఘాల్లో బీఆర్ఎస్ కు సన్నిహితంగా పని చేసే ఉద్యోగులకు నచ్చడం లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందా అంటే అదీ లేదు. రేవంత్ ను మాత్రం తాము కోరిన వెంటనే చేసేయాలని ఉద్యోగ సంఘాలు మంకు పట్టుపడుతున్నాయి అని సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ సర్కార్ కుదురుంటున్న సమయంలో సమ్మెకు వెళ్లవద్దని , కొంతకాలం వేచి చూద్దామని ఉద్యోగ సంఘాల్లో కొంతమంది సూచించినా, బీఆర్ఎస్ సన్నిహిత ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం దాన్ని ఖాతరు చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుండి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, జూన్ 9వ తేదీన హైదరాబాద్లో 50 వేల మంది ఉద్యోగులతో మహాధర్నా చేయనున్నట్టు ప్రకటించాయి ఉద్యోగ జేఏసీ సంఘాలు. అయితే, ఈ సమ్మె వెనక బీఆర్ఎస్ నేతల ప్రోద్బలం ఉందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. బీఆర్ఎస్ గ్రిప్ లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలను సమ్మె ముగ్గులోకి దించి , ప్రభుత్వాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలని ప్లాన్ వేసినట్టుగా అనుమానిస్తున్నారు.