తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 95 రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా మధ్యతరహా , సాధారణ బిల్డర్ల పాలిట వరంగా మారింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం భవనం ఎత్తు 18 మీటర్లు దాటితే దానిని హైరైజ్ కేటగిరీలోకి చేర్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిమితిని 21 మీటర్లకు పెంచడం వల్ల సాధారణ బిల్డర్లకు అదనపు అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు కలిగింది.
సాధారణంగా ఒక అంతస్తు ఎత్తు స్లాబ్ నుండి స్లాబ్‌కు సుమారు 3 మీటర్లు ఉంటుంది. పాత నిబంధన 18 మీటర్లు ప్రకారం.. స్టిల్ట్ పార్కింగ్ ప్లస్ 5 అంతస్తులు నిర్మిస్తేనే 18 మీటర్ల పరిమితికి దగ్గరగా వచ్చేది. ఆ పైన ఒక్క అడుగు పెరిగినా అది హైరైజ్ కిందకు వెళ్లి కఠినమైన నిబంధనలు వర్తించేవి. కానీ ఇప్పుడు 21 మీటర్ల పరిమితి వల్ల, బిల్డర్లు స్టిల్ట్ + 6 అంతస్తులు లేదా కొన్ని సందర్భాల్లో సెట్ బ్యాక్స్ , సీలింగ్ ఎత్తును బట్టి స్టిల్ట్ + 7 అంతస్తుల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ బిల్డర్లకు పెద్ద ఊరట.
ఒక భవనం హైరైజ్ కేటగిరీలోకి వెళ్తే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవడం, చుట్టూ వదిలే ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం, ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతులు వంటివి తప్పనిసరి అయ్యేవి. దీనివల్ల చిన్న ప్లాట్లలో బహుళ అంతస్తులు నిర్మించడం బిల్డర్లకు భారంగా ఉండేది. ఇప్పుడు 21 మీటర్ల వరకు వీటి అవసరం లేకపోవడంతో, తక్కువ స్థలంలోనే ఎక్కువ ఫ్లాట్లను నిర్మించి విక్రయించుకోవచ్చు. ఇది బిల్డర్లకే కాకుండా, కొనుగోలుదారులకు కూడా తక్కువ ధరలో ఇళ్లు అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, బాచుపల్లి, మియాపూర్ వంటి చోట్ల 400 నుండి 800 గజాల స్థలంలో అపార్ట్మెంట్లు కట్టే బిల్డర్లకు ఈ జీఓ వెన్నెముకగా నిలవనుంది. గతంలో హైరైజ్ నిబంధనల భయంతో కేవలం 5 అంతస్తులకే పరిమితమైన వారు, ఇప్పుడు అదనంగా మరో ఒకటి లేదా రెండు అంతస్తులు నిర్మించడం ద్వారా ప్రాజెక్ట్ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల నిర్మాణ రంగంలో కొత్త ఉత్సాహం రావడమే కాకుండా, స్థానిక మున్సిపాలిటీలకు ఫీజుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుంది.
