స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం వరకూ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. చట్టపరమైన అన్ని అవకాశాలను పరిశీలించి.. ఎంతో కొంత అవకాశం ఉందని భావిస్తూ .. ఆర్డినెన్స్‌కు మొగ్గి చూపింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లో సవరణలు చేసే ఆర్డినెన్స్ సిద్ధం చేసి రాజ్ భవన్‌కు పంపింది. గవర్నర్ సంతకం చేస్తే.. వెంటనే రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించేయవచ్చు. న్యాయపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే గవర్నర్ సంతకం పెడతారా లేదా అన్నదే సమస్య.
ర్డినెన్స్ జారీ చేస్తే రాజ్యాంగపరమైన సమస్యలు వస్తాయని నిపుణులు ఇప్పటికే తేల్చారు. సుప్రీం కోర్టు రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50 శాతంగా నిర్దేశించింది. ఆర్డినెన్స్ జారీ చేస్తే తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 70 శాతం దాటిపోతాయి. ఈ అంశం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వడంలో అడ్డంకిగా మారవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి ముందస్తు ఆమోదం అవసరమయ్యే విషయాలపై గవర్నర్ ఆర్డినెన్స్‌ను జారీ చేయరని భావిస్తున్నారు. గవర్నర్ పై ప్రభుత్వ ఒత్తిడి ఉంటే.. ఆయన న్యాయపరిశీలనకు పంపే అవకాశాలు కూడా ఉంటాయి.
రాజ్ భవన్ నుంచి ఇప్పుడు బిల్లు బయటకు రావడమే అత్యంత కీలకం. గవర్నర్ సంతకంతో వస్తే.. ప్రభుత్వం సక్సెస్ అయినట్లే. సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ జారీకి ముందు ఎలాంటి కసరత్తు చేయలేదని అనుకోలేం. ఆయన న్యాయపరంగా ఉండే కొన్ని అవకాశాల్ని ఉపయోగించుకునే .. ఆర్డినెన్స్ సిద్ధం చేయించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలకు గవర్నర్ సంతృప్తి చెందితే .. ఆర్డినెన్స్ జారీ ఏవుతుంది. లేకపోతే వివాదమవుతుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ మరోసారి రిస్క్ లో పడుతుంది.