దిగి వచ్చిన తెలంగాణా సర్కార్

తెదేపా, తెరాస రెండు పార్టీలు కూడా తాము అధికారంలోకి వస్తే పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వాటి మాటలు విశ్వసించి ఆ పార్టీలకు ఓటేసి అధికారం కట్టబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పార్టీలు మాట మార్చాయి. ముందు చెప్పినట్లుగా రుణాలన్నీ మాఫీ చేయకుండా వాయిదాల పద్దతిలో కొంచెం కొంచెం మాఫీ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు కనుక అది వాయిదాల పద్దతిలో రుణాలను మాఫీ చేయవలసి వస్తోందని సర్దిచెప్పుకోగలుగుతోంది కానీ రాష్ట్ర విభజన తరువాత దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా రెండవ ధనిక రాష్ట్రంగా అవతరించిందని సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించుకొన్నప్పుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా పంట రుణాలన్నిటినీ ఒకేసారి ఎందుకు తీర్చడం లేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అలాగా నిలదీసినందుకు వాటిని తెరాస ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించివేసింది. కానీ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉదృతం చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ “ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రైతుల రుణాలన్నీ ఒకే సారి పూర్తిగా చెల్లించాలని మా ప్రభుత్వం నిర్ణయించుకొంది. అలాగే త్వరలోనే రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించి తక్షణమే కరువు నివారణ చర్యలు కూడా చేపడుతాము,” అని తెలిపారు.

ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన రాష్ట్రంలో వేలాది రైతులకు మేలు కలుగుతుంది. కానీ ఇదే నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే అనేకమంది రైతుల ప్రాణాలు పోయేవి కావు. ఒక ముఖ్యమయిన నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం చేసిన జాప్యానికి అనేకమంది రైతులు బలయ్యారని అర్ధం అవుతోంది. మరో విషయం ఏమిటంటే ప్రతిపక్షాలు పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేసినప్పుడు, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి అంత మొత్తం చెల్లించలేదని తెరాస మంత్రులే వాదించారు. కానీ ఇప్పుడు అంత మొత్తాన్ని తెరాస ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేస్తామని చెపుతోంది. అంటే తెలంగాణా ప్రభుత్వానికి పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయగలిగే ఆర్ధిక స్తోమత ఉందని రుజువయింది. మరి అటువంటప్పుడు ఇంతకాలం రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడింది? ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి చేసినా అందుకు అంగీకరించని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు దిగివచ్చింది? అని ప్రశ్నించుకొంటే బహుశః వరంగల్ ఉపఎన్నికలు, ఆ తరువాత జి.హెచ్.ఏమి.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అయ్యుండవచ్చని అనుమానించవలసి వస్తోంది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పర్యటనలు చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. దాని వలన వరంగల్ ఉప ఎన్నికలలో నష్టపోతామనే భయంతోనే తెరాస ప్రభుత్వం రైతుల రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయడానికి అంగీకరించినట్లుంది. అయితే ఇదే నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే, అనేకమంది రైతులు ప్రాణాలు కోల్పోయేవారు కాదు..అలాగే ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్నందుకు తెరాస ప్రభుత్వానికి ఎంతో గౌరవంగా ఉండేది. ఇప్పటికయినా తెరాస ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొంది. చాలా సంతోషం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com