ఫోన్ ట్యాపింగ్ కేసును కొత్త మలుపు తిప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపింది. ఫోన్ టాపింగ్ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిందని..ఈ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని..నివేదికను నేరుగా కోర్టుకు సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ 1గా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు కోర్టుకు హామీ ఇచ్చినట్లుగా విచారణకు సహకరించడం లేదని తెలిపింది.
ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో సంచలన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం ద్వారా వచ్చే వారంలో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ను నిరూపించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. పైగా ఆధారాలన్నీ ఫలితాలు రాగానే ధ్వంసం చేశారని స్వయంగా విచారణాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసు నిర్వీర్యం అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ హఠాత్తుగా ప్రభుత్వం ఫోరెన్సిక్ సాక్ష్యాల గురించి నేరుగా సుప్రీంకోర్టుకే తెలిపింది.
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎవరూ చెప్పరు. కానీ ఆధారాలు ఏమిటని అందరూ సందేహిస్తారు. ప్రభుత్వం కూడా విచారణ జరిపినప్పుడు అనేక అంశాలను లీక్ చేసింది కానీ.. ఆధారాలను మాత్రం ఇప్పటి వరకూ చూపించలేకపోయారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలను చూపిస్తే.. మరోసారి ఈ కేసు హైలెట్ అవుతుంది.