తెలకపల్లి వ్యూస్ : మీ జీతాల పెంపుపై మాట్లాడొద్దా?

తెలంగాణ శాసనసభ్యుల జీతాలను 400 రెట్లుపైగా పెంచారు. దీన్ని ఎలా చూడాలన్నది చాలా మంది లేవనెత్తిన మీమాంస. ప్రజల ప్రతినిధిగా బాధ్యతల నిర్వహణకు అవసరమైన మేరకు సదుపాయాలు కల్గిస్తూ పెరిగిన వ్యయానికి తగినట్టు జీతం నిర్ణయిస్తే అభ్యంతరం లేదు. కాని సాఫ్ట్‌వేర్‌ కుర్రాళ్లతోనో ఎంఎన్‌సిలలో పనిచేసే అమ్మాయిలతోనో ప్రజా ప్రతినిధుల జీతాలు పోల్చుకోవడం సరైందా? ఇది గౌరవప్రదమైన ఐచ్చిక బాధ్యత తప్ప ఎవరూ ఇచ్చిన ఉద్యోగం కాదు. అన్నిరకాల భత్యాలు కలసి నెలకు మూడు లక్షల వరకూ ఎంఎల్‌ఎలకు ముట్టజెప్పడం కమ్యూనిస్టులు మినహా  ఇతర సభ్యులందరూ ఆహ్వానించారు. పైగా మరింత పెంచాలని మరిన్ని రకాల నిధులు అందుబాటులో వుంచాలని సూచనలు చేశారు. వాటిని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొంత వరకూ ఆమోదించి మరింత పరిశీలన చేస్తామని హామీ నిచ్చారు.

మరోవైపున విలేకరులు మీడియా వ్యాఖ్యాతలు దీనిపై విమర్శలు చేయొద్దని సలహా కూడా ఇచ్చారు. త్యాగాల కాలం కాదు గనక ప్రతిఫలం వుండాల్సిందేనన్న భావన ఆయన మాటల్లో తొంగిచూసింది. ప్రజా ప్రతినిధులకు ఎన్నో ఖర్చులు ఉంటాయంటూ ఇంటికి వచ్చిన వారికి టీలు ఇవ్వకపోతే ‘సన్నాసి’ అంటారనీ, గుడికి బడికి విరాళాలు అడిగితే ఇవ్వాల్సి వుంటుందని ఉదాహరణలిచ్చారు. వీటిలో కొంత నిజం వుండొచ్చు గాని ప్రజా ప్రతినిధులైన వారు సేవా గుణంతో పనిచేయడం ముఖ్యం కాదా? మిగిలిన ఉద్యోగులు లేదా ఏజంట్లలాగా వారి ప్రతి సేవకూ మూల్యం లెక్కగట్టడం న్యాయమేనా?

పుచ్చలపల్లి సుందరయ్యలాగా సైకిల్‌ ఎక్కి రానవసరం లేదు గాని కార్ల బారు అనుచరుల సమూహాలు అంత అవసరమా? ఆలోచించాలి. నిరాడంబరంగా వుండేవారు నిబద్దంగా సేవ చేయలేదా? ఎంఎల్‌ఎలు నీతిగా వుండాలంటే తగినంత జీతం ఇవ్వాలని కొందరి వాదన. అంటే భారీ జీతాలు వేల కోట్ల లాభాలు వున్నవారు కుంభకోణాలకు పాల్పడ్డం లేదా? స్థానిక సంస్థలనూ కార్యకర్తలనూ పక్కనపెట్టి అన్నిటిలోనూ ఎంఎల్‌ఎలు ఎంపిలే తలదూర్చవలసిన అవసరం వుంటుందా? ఇలాటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతాయి.

ప్రజా సేవ కోసం వస్తు రూపేణా రీ ఇంబర్సు చేస్తే అభ్యంతరం వుండదు. అంతేగాని తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ఖర్చులన్నీ ప్రజలే భరించాలనుకోవడం సరికాదు. ఇప్పుడు శతకోటీశ్వరులే అధికంగా ఎన్నికవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి లేదా ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక గల్లా జయదేవ్‌ ఇంటికి వచ్చిన వారికి అతిధ్యం ఇవ్వలేక ప్రభుత్వ సహాయంపై అధారపడాల్సి వుంటుందా? సంపన్నులు వారిపై ఆధారపడిన వారే చట్టసభలకు అధికంగా వస్తుంటే వారి ప్రతి ఖర్చునూ ప్రభుత్వం భరించవలసిన అగత్యమేమిటి? ఇలా అయితే రేపు ఓట్ల కొనుగోలుకు చేసిన ఖర్చు కూడా సబ్సిడీగా ఇవ్వాలా?

పార్లమెంటు సభ్యుల జీతం 5, 000 కు పెంచుతుంటేనే సుందరయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి దీనికి పోలిక ఎక్కడ? కట్టిపడేసుకోవడానికి ఆకట్టుకోవడానికి అస్త్రంగానే ఈ అసాధారణ పెంపుదల ప్రకటించారన్న అభిప్రాయం కలిగితే అందులో పొరబాటు వుందా? వేలాది మంది కార్మికులు ఉద్యోగులు జీతాల పెంపుకోసం పోరాడి అలసిపోతుంటే ఎంఎల్‌ఎలు తమ జీత భత్యాలు తామే భారీగా పెంచుకోవడం ఎలాటి సంకేతాలిస్తుందో అలోచించాలి.

ఏపిలోనూ బాగా పెంచారు గనక ఈ విమర్శ వారికీ వర్తిస్తుంది. రైల్వే ప్రయాణానికి కూపన్లు ఇచ్చే బదులు లక్ష రూపాయలు నెలకు భత్యం ఇవ్వాలనే నిర్ణయం ఆంతర్యమేమిటి? పార్లమెంటులో ప్రశ్నల కుంభకోణం, పాస్‌పోర్టుల కుంభకోణం,ఇక్కడ రాష్ట్రాల్లో రకరకాల అవినీతి వ్యవహారాలు కేవలం ఎంపిల, ఎంఎల్‌ఎల పేదరికం వల్లనే జరిగాయా? పోనీ ప్రస్తుత సభ్యులు విధి నిర్వహణకోసం పెంచారనుకుంటే మాజీల పెన్షన్తు ఎందుకు బారీగా పెంచారు? అందువల్ల ఇది రాజకీయ నేతలు తమకు తాము ఇచ్చుకున్న బహుమానం వంటిదే. మిగిలిన చాలా అంశాల్లాగే ఇది కూడా విమర్శా పాత్రమే. ఈ పెంపుదల వల్ల ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఒక ప్రత్యేక వృత్తి రాజకీయ వర్గంగా స్థిరపడిపోతే ఇక సేవాదృక్పథంతో మాట్లాడేవారెవరు? త్యాగాలకు కాలం కాదని ముఖ్యమంత్రే చెబుతుంటే మరో విధంగా ఆలోచించేదెవరు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com